- మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల సందర్శన
వరంగల్/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేందుకు కుట్ర పన్నిందే సీఎం రేవంత్‍రెడ్డి అని, దాన్ని బాంబులు పెట్టి పేల్చారనే అనుమానంతో ఫిర్యాదు చేస్తే మూడేండ్లుగా తేల్చకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖరరెడ్డి, సుధీర్‍రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డితోపాటు మాజీ మంత్రి దయాకర్‍రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‍హౌస్ ను సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘పెద్ద ప్రాజెక్టులు కట్టే ప్రక్రియలో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటయ్. అది ఎవరైనా కావాలని చేసిందో లేదంటే ప్రమాదమో కానీ కావాల్సిన రిపేర్లు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి కదా.. కానీ, సీఎం రేవంత్‍రెడ్డి మాత్రం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటే కేసీఆర్‍కు పేరు వస్తుందని బ్యారేజీలకు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు.’ అని ఆరోపించారు.
నీటి సమస్యకు కారణం ప్రభుత్వ చేతకానితనమే..
రాష్ట్రంలో నీటి సమస్యకు ఎల్‍నినో కారణం కాదని, కాంగ్రెస్ సర్కారు చేతకానితనమేనని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎల్‍నినో ప్రభావం నేపథ్యంలో కన్నెపల్లి పంప్‍హౌజ్‍వద్ద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని మూడు నెలలముందే బీఆర్ఎస్ సూచించినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే కన్నెపల్లి వద్ద 758 టీఎంసీ నీళ్లు, సమ్మక్క బ్యారేజీ నుంచి 1,450 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిశాయని చెప్పారు.
ఇక్కడి నీటిని కాపాడాల్సిన సీఎం రేవంత్‍రెడ్డి దాన్నివదిలేసి, కేసీఆర్ కొండపోచమ్మ వద్ద నీళ్లు ఎత్తుకుపోతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో నీటి సమస్య జఠిలమైతే ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేంతా సీఎం రేవంత్ ఇంటిముందు ఆందోళన చేపడ్తామని హెచ్చరించారు. కాగా, కన్నెపల్లి పంప్‍హౌస్ సందర్శన సమయంలో ఎమ్మెల్యేల బృందం లోపలకు వెళ్లందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
