- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
- 2015లోనే ఫార్మా సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినం
- ఫార్మా సిటీపై రేవంత్ సర్కారు ఎటూ తేల్చడం లేదు
- మూడో పంటకూ ఇస్తామన్న రైతుభరోసా ఏమైంది
- ఈ సారి దసరా.. పండుగలాగే లేదని వ్యాఖ్య
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫార్మా సిటీ కడితే కట్టాలని.. లేకపోతే రైతుల భూములు తిరిగివ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 2015లో ఫార్మా సిటీ ఏర్పాటుకు తాము శ్రీకారం చుట్టామని, 14 వేల ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు ప్రమిదా గార్డెన్స్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి దసరా సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్మా సిటీపై రేవంత్ సర్కారు ఎటూ తేల్చడం లేదని విమర్శించారు. ఈ ఏడాది బతుకమ్మ చీరలు ఇవ్వక, రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాక దసరా పండుగ.. పండుగలాగే లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మూడో పంటకు కూడా రైతుభరోసా ఇస్తామన్నారని, ఒక్క పంటకు కూడా ఇవ్వలేదన్నారు.
నాట్లకు కాదు గదా కోతలకు కూడా రైతులకు రూ.10 వేలు ఇవ్వలేకపోయారన్నారు. రైతుల తరఫున పోరాటం చేస్తుంది తామేనని, మిగతా పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ కోటాలో అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన ఒక్క మంచిపని చెప్పాలన్నారు. గుంపుమేస్త్రీ అని చెప్పిన రేవంత్.. ఇప్పుడు కూల్చే మేస్త్రీగా మారిండని ఆరోపించారు. ఈ రాష్ట్రం కేసీఆర్ ను కోరుకుంటోందన్నారు. మూసీ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘ఫాం హౌస్‌లు కూలుస్తాం అంటున్నవ్.. కూల్చమనే మేము చెప్తున్నం. మా ఇండ్లు కూల్చు ఒప్పుకుంటాం.. కానీ, పేదల ఇండ్లు కూల్చకు’ అని కేటీఆర్అన్నారు. తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేద్దామని కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు.
రుణమాఫీపై అనుముల ఇంటెలిజెన్స్
తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అయితే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన చిత్రాన్ని వాడారో.. రుణమాఫీ జరిగిన రైతుల లెక్క విషయంలో కూడా మీ ముఖ్యమంత్రి ఏఐ టెక్నిక్ వాడారంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య (అనుముల ఇంటెలిజెన్స్) అంటే రేవంత్ రెడ్డి వాడిన అబద్ధాల ఏఐ టెక్నిక్ తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు.
నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రుణమాఫీ విషయంలో నిబంధనలు, తేదీలు మారుతున్నప్పటికీ..ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రమే నిత్యం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.