సిజేరియన్ ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. త్వరగా కోలుకోవడానికి సూచనలు

సిజేరియన్ ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. త్వరగా కోలుకోవడానికి సూచనలు

మాతృత్వ ప్రయాణంలో ప్రసవం అత్యంత కీలకమైన ఘట్టం. అయితే, కొన్ని సందర్భాల్లో తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాలని సూచిస్తారు. దీనినే సిజేరియన్ ప్రసవం అంటారు. సిజేరియన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన అవసరం.

అసలు సిజేరియన్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే.. తల్లికి అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం, మాయ గర్భసంచి ద్వారానికి దగ్గరగా ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా కాళ్లు కిందికి ఉండటం, బిడ్డకు రక్తప్రసరణలో సమస్యలు రావడం, బిడ్డ సాధారణం కంటే చిన్నగా లేదా పెద్దగా ఉండటం, కవలలు ఉండటం వంటి కారణాలతో సిజేరియన్ అవసరం కావచ్చు. గతంలో సిజేరియన్ లేదా గర్భసంచికి సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగినా వైద్యులు ప్రసవ విధానాన్ని జాగ్రత్తగా నిర్ణయిస్తారు.సహజ ప్రసవానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల్లికి సంక్రమణ కారణంగా జ్వరం రావడం, బిడ్డ గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కనిపించడం, గర్భసంచి ద్వారం తెరుచుకోకపోవడం, బిడ్డ తల కిందికి దిగకపోవడం వంటి సమస్యలు ఎదురైతే అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.

త్వరగా కోలుకోవడానికి..

సిజేరియన్ సమయంలో సాధారణంగా వెన్నెముక దిగువ భాగంలో మత్తుమందు ఇచ్చి, పొట్ట కింది భాగంలో అడ్డంగా కోత పెట్టి బిడ్డను బయటకు తీస్తారు. అనంతరం కుట్లు వేస్తారు. ఈ శస్త్రచికిత్సలో అధిక రక్తస్రావం, గాయానికి సంక్రమణ, కాళ్లలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత వైద్యుల సహాయంతో నెమ్మదిగా నడవడం ప్రారంభించాలి. నొప్పి ఎక్కువగా ఉంటే వైద్యులకు తెలియజేయాలి. సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల్లో ఇంటికి వెళ్లవచ్చు. అయితే, తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ సమయం మారుతుంది.

గాయం, కుట్ల విషయంలో జాగ్రత్తలు

శస్త్రచికిత్స చేసిన గాయాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. స్నానం చేసిన తర్వాత మెత్తటి వస్త్రంతో నెమ్మదిగా అద్దాలి. కుట్లపై ఒత్తిడి పడకుండా వదులైన దుస్తులు ధరించాలి. గాయం ఎర్రబడటం, వాపు, చీము, రక్తస్రావం లేదా జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కనీసం ఆరు వారాలపాటు బరువైన వస్తువులు ఎత్తడం, కష్టమైన పనులు చేయడం నివారించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పొట్టకు దిండును ఆనించి పట్టుకోవచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో పొట్టకు మద్దతుగా ఉండే బెల్టును ఉపయోగించవచ్చు. బిడ్డ సంరక్షణలో కుటుంబ సభ్యుల సాయం తీసుకుంటూ తగినంత విశ్రాంతి పొందాలి.

ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ

మలబద్ధకం రాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సాధారణంగా రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం ఉపయోగకరం. ఇతర ఆరోగ్య సమస్యలతో ద్రవ పదార్థాలపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలు పాటించాలి.
ఆరోగ్య పరిస్థితి అనుకూలిస్తే మొదటి రోజు నుంచే నెమ్మదిగా నడవవచ్చు. ఆరు వారాల తర్వాత వైద్యుల అనుమతితో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ప్రారంభించాలి. పొట్ట వ్యాయామాలు, బరువులు ఎత్తడం వంటి వాటిని శరీరం కోలుకున్నాకే చేయాలి. వ్యాయామ సమయంలో నొప్పి లేదా అధిక అలసట కలిగితే వెంటనే ఆపాలి.

మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యం

ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, అలసట వల్ల చిరాకు, ఆందోళన, బాధ కలగవచ్చు. కుటుంబ సభ్యులు తల్లికి అండగా నిలిచి, బిడ్డ సంరక్షణలో సాయం చేయాలి. బిడ్డ నిద్రపోయినప్పుడు తల్లి కూడా విశ్రాంతి తీసుకోవాలి. బాధ లేదా కుంగుబాటు ఎక్కువ రోజులు కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

వైద్యుల సూచనలే ముఖ్యం

గాయం నుంచి అధిక రక్తస్రావం, తీవ్రమైన పొట్ట నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, చూపులో మార్పులు, ఒక కాలులో వాపు లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి. జ్వరం, గాయం నుంచి చీము కారడం వంటి లక్షణాలనూ నిర్లక్ష్యం చేయకూడదు.ప్రతి తల్లి ప్రసవ అనుభవం భిన్నంగా ఉంటుంది. సహజ ప్రసవమైనా, సిజేరియన్ అయినా తల్లి, బిడ్డ క్షేమమే ముఖ్యం. 

- డా. శ్వేత పద్మ
కన్సల్టెంట్ ఒబెస్ట్రెషియన్
ఫెర్నాండెజ్ హాస్పిటల్స్