అడుగడుగునా అమ్మవారి ప్రతిమలు.. కళ్లు చెదిరే మండపాలు.. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు.. ఢాక్ డప్పుల మోతలు.. భక్తుల సందడి.. ఇదీ కోల్కతా దుర్గాపూజ వైభవం! మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకలు బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి. భక్తితోపాటు కళా వైభవాన్ని చాటిచెప్పే ఈ ఉత్సవాలు నగరాన్ని ఓ మహా సంబరాల వేదికగా మారుస్తాయి.
కోల్కతాలో ప్రతి వీధిలోనూ ఓ ప్రత్యేక మండపం కనిపిస్తుంది. ఒకచోట సంప్రదాయ కళలు కనువిందు చేస్తే.. మరోచోట చారిత్రక కట్టడాలను తలపించే నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని మండపాలు సామాజిక అంశాలను ప్రతిబింబించే వినూత్న ఇతివృత్తాలతో అలరిస్తాయి. కళాకారులు నెలల తరబడి శ్రమించి రూపొందించే దుర్గమ్మ విగ్రహాలు, మండపాల అలంకరణలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
ఢాక్ మోతలు.. సింధూర కేళి సందడి!
దుర్గాపూజ వేళ బెంగాలీ సంప్రదాయ వాయిద్యం ఢాక్ మోతలు ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మండపాలను సందర్శిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారు. విజయదశమి సందర్భంగా మహిళలు నిర్వహించే సింధూర కేళి మరో ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారికి సింధూరం సమర్పించి, ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటారు.
అనంతరం అమ్మవారి విగ్రహాలను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తూ వీడ్కోలు పలుకుతారు. ఈ ఏడాది అక్టోబర్10న మహాలయ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించిన ‘ఉమా ఆగమనీ’ వేడుకల్లో ఢాక్ మోతలు, డ్రోన్ ప్రదర్శన, బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో12,400 కొత్త దుర్గాపూజలకు అనుమతులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
ప్రపంచ వారసత్వ గుర్తింపు
కోల్కతా దుర్గాపూజకు 2021లో యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ గుర్తింపు లభించింది. భక్తి, కళలు, సామూహిక భాగస్వామ్యం, సంప్రదాయ వృత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకగా ఈ గుర్తింపు దక్కింది.
కుమార్టులీ కళాకారుల సృజనాత్మకత
దుర్గాపూజ వైభవంలో కుమార్టులీ కళాకారుల శ్రమ కీలకం. కోల్కతాలోని ఈ ప్రాంతంలో గంగానది మట్టితో నెలల ముందే దుర్గమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యుల విగ్రహాలను రూపొందిస్తారు. మహాలయ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి కళ్లను చిత్రించే సంప్రదాయం ప్రత్యేకమైనది. కళాకారులు తమ నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాలకు జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. మరోవైపు, మండపాలను సంప్రదాయ కళలు, చారిత్రక కట్టడాలు, సమకాలీన సామాజిక అంశాలను ప్రతిబింబించేలా అలంకరిస్తారు.
పూజా సంప్రదాయాలు.. ధునుచి నృత్యాలు!
మహాలయతో మొదలయ్యే ఆధ్యాత్మిక సందడి షష్ఠి నుంచి మరింత ఊపందుకుంటుంది. సప్తమి రోజు నవపత్రిక స్నానం, అష్టమి రోజు పుష్పాంజలి, సంధిపూజ వంటి పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనే ధునుచి నృత్యం ఉత్సవాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.
అమ్మవారికి సమర్పించే ప్రత్యేక నైవేద్యం ‘భోగ్’ను భక్తులకు ప్రసాదంగా పంచడం కూడా ఈ వేడుకల్లో ముఖ్యమైన సంప్రదాయం. మతం, వర్గం, ప్రాంతాల భేదాలను పక్కనపెట్టి లక్షలాది మంది ఒకచోట చేరి ఉత్సవాల్లో పాల్గొనడం కోల్కతా దుర్గాపూజ ప్రత్యేకత.
పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం
మరోవైపు, పండుగ వైభవంతో పాటు పర్యావరణ పరిరక్షణపైనా నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది కొన్ని ప్రముఖ మండపాల్లో ప్లాస్టిక్, సేంద్రియ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, ప్లాస్టిక్ను పునర్వినియోగానికి పంపడం, సేంద్రియ వ్యర్థాలతో ఎరువులు తయారు చేయడం వంటి ‘జీరో వేస్ట్’ చర్యలు చేపట్టారు. ఇలా ఉత్సవాల సందర్భంగా ఏర్పడే వ్యర్థాలను తగ్గించడంతో పాటు పర్యావరణ హిత పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
