
కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి 12వ ఎడిషన్ వార్షిక వేడుకల సందర్భంగా ఫొటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించారు. ‘బిగ్ పిక్చర్ ఫొటోగ్రఫీ’ అనే ఈ పోటీలో 60 దేశాల నుంచి వేలల్లో ఎంట్రీలు వచ్చాయి. అందులో ప్రపంచంలోని అత్యద్భుతమైన నేచర్, లాండ్ స్కేప్, వైల్డ్ లైఫ్ ఫొటోలు కనువిందు చేశాయి. అంతేకాదు.. ఆక్వాటిక్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ నేచర్, హ్యూమన్ – నేచర్, వాటర్ స్కేప్స్, ఫ్లోరా, ఫొటోస్టోరీ వంటి విభిన్న ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి.
లెముర్ లైఫ్ : చూడ్డానికి కోతిలా ఉన్న లెముర్ అనే ఈ జంతువులు ఆహార వేటకు వెళ్తున్నాయి. వాటిలో ఒక తల్లి లెముర్ తన పిల్లను హత్తుకుని జంప్ చేస్తోంది. ఈ అరుదైన చిత్రాన్ని చైనాకు చెందిన ఫొటోగ్రాఫర్ డాంగ్లిన్ తీసింది.
థర్డ్ ఐ : ఈ దృశ్యం అచ్చం పెయింటింగ్లానే ఉంది కదూ! మధ్యలో కొంత నీరు, చుట్టూ గడ్డకట్టిన మంచు, మెల్లగా కరిగి నీటిగా మారుతున్న దశలు, గుర్తు తెలియని పాద ముద్రలు.. అన్నీ కలిపి చూస్తే కన్ను ఆకారంలో ఆశ్చర్యపరుస్తోంది ఈ చిత్రం. ఇంత అద్భుతమైన చిత్రాన్ని సొంతూరిలోనే తీశాడు పోలాండ్కు చెందిన ఫొటోగ్రాఫర్ రిబ్నిక్.