ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే 'రాజస్థాన్' గెలవాల్సిందే.. లక్నో షాకిస్తుందా?

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే 'రాజస్థాన్' గెలవాల్సిందే.. లక్నో షాకిస్తుందా?

RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు (2026, మే 19న ) రాత్రి 7:30 గంటలకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో, రాయల్స్ అవకాశాలను దెబ్బతీసి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌లు ఆడాయి.. రాజస్థాన్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలవగా, గత 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన RR.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ప్లేఆఫ్స్‌కు నేరుగా అర్హత సాధించాలంటే రాయల్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.  

మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి నాకౌట్ అయినప్పటికీ, గత కొన్ని మ్యాచ్‌లు నుంచి మంచి ఫామ్‌లోకి వచ్చింది. రాజస్థాన్‌ను ఓడించి 'స్పాయిల్ స్పోర్ట్' పాత్ర పోషించాలని లక్నో భావిస్తోంది. 

'కీ-బ్యాటిల్స్': 
మిచెల్ మార్ష్ vs జోఫ్రా ఆర్చర్: లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో పాటు ఒక మ్యాచ్ లో 90 పరుగులతో చెలరేగాడు. అతన్ని అడ్డుకోవడానికి రాజస్థాన్ పవర్‌ప్లే స్పెషలిస్ట్ జోఫ్రా ఆర్చర్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ సీజన్ పవర్‌ప్లేలోనే ఆర్చర్ 9 వికెట్లు పడగొట్టాడు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన T20 పోరాటంలో మార్ష్ 8 బంతుల్లో 13 పరుగులు చేయగా, ఆర్చర్ ఒకసారి అతడిని అవుట్ చేశాడు.

వైభవ్ సూర్యవంశీ vs ప్రిన్స్ యాదవ్: ఈ సీజన్ పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ 244.51 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 401 రన్స్ చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతనికి బ్రేక్ వేసేందుకు లక్నో బెస్ట్ బౌలర్, ప్రస్తుతం టీమిండియా రేడార్‌లో ఉన్న ప్రిన్స్ యాదవ్ రెడీ అవుతున్నాడు. వీరిద్దరి మధ్య పోరు ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తుంది.

రియాన్ పరాగ్ vs మయాంక్ యాదవ్: ఈ టోర్నీ ప్రారంభంలో తడబడినా, గత రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై బ్యాక్-టు-బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి రియాన్ పరాగ్ ఫామ్‌లోకి వచ్చాడు. లాంగ్ ఇంజ్యూరీ బ్రేక్ తర్వాత పట్టుదలగా ఉన్న లక్నో ఎక్స్‌ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ తన 'హిట్-ది-డెక్' బౌలింగ్‌తో పరాగ్‌ను ఎలా కట్టడి చేస్తాడో చూడాలి మరీ. 

ఎవరు గెలుస్తారంటే!: 
లక్నో సూపర్ జెయింట్స్ గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి మొమెంటం సాధించినప్పటికీ.. మ్యాచ్ ప్రాముఖ్యత, టీమ్ కాంబినేషన్స్ పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో పుంజుకునే ఛాన్స్ ఉంది. హోరాహోరీగా సాగే ఈ పోరులో చివరకు రాజస్థాన్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.