ఇంగిల్‌వుడ్: ఫిఫా వరల్డ్ కప్‌లో కెనడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన రౌండ్–32 మ్యాచ్‌లో 1–0తో సౌతాఫ్రికాపై గెలిచింది. ఫలితంగా తమ ఫుట్‌బాల్ చరిత్రలో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో గెలవడం కెనడాకు ఇదే తొలిసారి. సెకండాఫ్ స్టాపేజ్ టైమ్ (90+2వ ని)లో మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ యుస్టాకియో గోల్ కొట్టి కెనడాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆరంభం నుంచే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాల వరకు ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.
గాయం కారణంగా గ్రూప్ మ్యాచ్‌లకు దూరమైన డిఫెండర్ ఆల్ఫోన్సో డేవిస్ 75వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్‌లోకి వచ్చి జట్టులో ఉత్సాహం నింపాడు. అదే టైమ్‌లో సఫారీ రక్షణ శ్రేణి కెనడా దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. గోల్ కీపర్ రోన్వెన్ విలియమ్స్ ఐదు అద్భుతమైన సేవ్స్‌తో జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరి నిమిషాల్లో కెనడా స్ట్రయిక్స్‌ను అడ్డుకోలేకపోయాడు.
