ఆ రోజు విమానంలో అసలేం జరిగింది..? పిన్ టూ పిన్ వివరించిన పైలట్ స్మిత్ మచ్చర్

ఆ రోజు విమానంలో అసలేం జరిగింది..? పిన్ టూ పిన్ వివరించిన పైలట్ స్మిత్ మచ్చర్

న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక దాడి గురించి కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తొలిసారి స్పందించారు. ఆ రోజు విమానంలో తనపై జరిగిన దాడి, ప్రాణం కోసం చేసిన పోరాటం, ప్రయాణికులు ఆందోళన, ఇతర పైలట్లు విమానాన్ని సేఫ్‎గా ల్యాండింగ్ చేయడం వంటి విషయాలను స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిన్ టూ పిన్ వివరించారు. ఒమన్‎కు చెందిన కో పైలట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాను స్పృహ కోల్పోకుండా పోరాడుతూ.. బ్రతుకుతానో లేదోనని ఆందోళన చెందానని మచ్చర్ తెలిపారు. కానీ ప్రయాణికులను రక్షించడం కోసం ఎలాగైనా ప్రాణాలతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు.

‘‘విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‎లోని టెల్ అవీవ్‎కు వెళ్తుండగా ఫ్లైట్‎లో ఉన్న ఒమన్‏కు చెందిన కో పైలట్ తనపై వెనక నుంచి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రంగా గాయమైంది. ప్రాణాలకు తెగించి అతనితో పోరాడా. తనలోని శక్తినంతా కూడగొట్టుకుని ఎలాగోలా కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశా. కాక్‌పిట్ తలుపు తెరిచిన తర్వాత విమానంలో తీవ్ర భయాందోళనలు, కేకలు వినిపించాయి. 

నేను బోర్లా పడిపోయి ఉన్నాను. కానీ నా ప్రయాణికులను కాపాడటం కోసం నేను మళ్లీ కాళ్లపై నిలబడాలని నాకు తెలుసు. ఇతరులను చావనివ్వలేకనే నేను నా ప్రాణాల కోసం, వారి కోసం పోరాడాను. నేను చనిపోవడానికి సిద్ధంగా లేను. ఏదైనా చెయ్యాలి.. లేదంటే అంతే సంగతులు అని మనసులో అనుకున్నా. విమానంలో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్ సకాలంలో స్పందించడం వల్లే ఆ ఘోర ప్రమాదం తప్పింది. 

కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కిందకు దూకించేస్తున్న సమయంలో ఈ పైలట్ అత్యంత వేగంగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించి విమాన నియంత్రణను తన చేతుల్లోకి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయం వైపు మళ్లించి, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో 174 మందితో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనను చంపాలని చూసిన కో-పైలట్ కంటే ఆ క్లిష్ట సమయంలో విమానాన్ని, అందరి ప్రాణాలను కాపాడిన ఆ రెండో సహోద్యోగి చేసిన సాయాన్ని తన జీవితాంతం మర్చిపోలేను’’ అని స్మిత్ మచ్చర్ వెల్లడించారు. 

అసలేం జరిగిందంటే..?

2026, సెప్టెంబర్ 30న ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ లోని రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్పై ఒమన్కు చెందిన కో పైలట్ అల్-హమ్మామి కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.

ఆకాశంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పైలట్ స్మిత్ మచ్చర్ కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే కాక్ పిట్లోకి ప్రవేశించి కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు.

కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లైదుబాయ్ విమాన ఘటనను యూఏఈ ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.