హనుమంతుడే ధైర్యమిచ్చాడు.. ప్రధాని మోదీతో వీడియో కాల్‌‌‌‌లో..  కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెల్లడి  

హనుమంతుడే ధైర్యమిచ్చాడు.. ప్రధాని మోదీతో వీడియో కాల్‌‌‌‌లో..  కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెల్లడి  
  •     ఎవరూ చనిపోవద్దని అనుకున్నా..
  •     శక్తినంతా కూడదీసుకుని.. కాక్‌‌‌‌పిట్ డోర్ తెరిచా
  •     ఫ్లైదుబాయ్ విమాన ఘటనను ప్రధానికి వివరించిన కెప్టెన్ 
  •     అహింస అసలు అర్థం ఏమిటో మీరు చాటారు: ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ/అబుదాబి: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలెట్ దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డప్పటికీ ఎలాగైనా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని భావించానని ఇండియన్ పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. తీవ్రంగా గాయపడి, కింద పడి ఉన్న తనకు హనుమంతుడే ధైర్యం ఇచ్చాడని.. శక్తినంతా కూడదీసుకుని కాక్‌‌పిట్ డోర్ తెరవగలిగానని చెప్పారు. విమానం కూలిపోకుండా కాపాడిన ఘటనలో ఇతరులు కూడా తెగువ చూపారని అన్నారు. బుధవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్ జెడ్1073 విమాన కాక్‌‌పిట్‌‌లో ఒమన్ దేశస్తుడైన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మచ్చర్.. ప్రాణాలకు తెగించి అతడితో పోరాడి విమాన ప్రమాదం నుంచి 174 మందిని రక్షించగలిగారు.

ప్రస్తుతం యూఏఈలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌‌‌‌ శుక్రవారం ప్రధాని మోదీతో వీడియో కాల్‌‌లో మాట్లాడారు. విమానంలో దాడి ఘటనను వివరించారు. ‘‘కోపైలెట్ దాడిలో నేను తీవ్రంగా గాయపడి కాక్‌‌పిట్‌‌లో కింద పడిపోయాను. నాలో మిగిలిన కొద్దిపాటి శక్తిని కూడదీసుకున్నాను. నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. అదేసమయంలో ఇతరులను కాపాడాలని అనుకున్నాను. అది చాలా క్లిష్టమైన క్షణం. ఆ సమయంలో విమానం కూలిపోబోతోందని నాకు అర్థమైంది. నాకు చాలా గాయాలయ్యాయి. కానీ నేను లేచి పనిచేయాలని నాకు నేను చెప్పుకున్నాను. ఆ సమయంలో నేను కాక్‌‌పిట్ తలుపు తెరిచేలా నన్ను నేను సమాయత్తం చేసుకున్నాను. ఇతర వ్యక్తుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది” అని ఆయన చెప్పారు. తాను హనుమాన్ భక్తుడినని, కష్టాలు ఎదురైనప్పుడల్లా హనుమాన్ చాలీసా పఠిస్తానని తెలిపారు. తాను 17 ఏండ్లుగా విమానాలు నడుపుతున్నానని చెప్పారు. ఈ ఘటన తన జీవిత ప్రయాణంలో భాగమని, త్వరలోనే కోలుకుంటాననే నమ్మకం ఉందని మచ్చర్ చెప్పారు. ప్రధాని మోదీతో మాట్లాడతానని అనుకోలేదని.. ఈ క్షణం తనకు చాలా ప్రత్యేకమని ఉద్వేగానికి గురయ్యారు.  

140 కోట్ల మంది గౌరవాన్ని పెంచారు: మోదీ

పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, ప్రశాంతతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘‘ఈ ఘటన తర్వాత, భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టేవారని దేశం గర్వంగా చెప్పగలదు. మీరు140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు. ‘‘మీరు త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రార్థనలు జరిగాయి. చాలామంది భారతీయులు మహామృత్యుంజయ మంత్రం జపిస్తున్నారు. భారత్ మీకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తోంది” అని తెలిపారు. ‘‘భారతీయ పైలెట్‌‌ల కీర్తిని మీరు పెంచారు. ఇకపై ప్రపంచం వారిని కొత్త కోణంలో చూస్తుంది. నేడు గాంధీ జయంతి. అహింస అసలు అర్థం ఏమిటో మీరు ప్రపంచానికి చూపించారు” అని అన్నారు.