క్యారట్ తో వెరైటీ వంటకాలు:వడలు..పోలేలు..మురబ్బా ఇలా చేయండి..బలానికి బలం..టేస్ట్ అదిరిపోవాల్సిందే..!

క్యారట్ తో వెరైటీ వంటకాలు:వడలు..పోలేలు..మురబ్బా ఇలా చేయండి..బలానికి బలం..టేస్ట్ అదిరిపోవాల్సిందే..!

క్యారెట్​తో వంటకాలంటే..కొన్ని రకాల కూరలు, అప్పుడప్పుడు పచ్చళ్లు తప్ప ఇంకేం చేస్తాం అనుకుంటాం. కానీ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉండే క్యారెట్లతో ఇంకా బోలెడు వెరైటీ వంటలు ట్రై చేయొచ్చు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్లతో పాటు గరంగరం వడలు, పోలేలు,  మురబ్బావండుకోవచ్చు. ఇవి రుచి తోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.  ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

క్యారట్​ వడలు తయారీకి కావలసినవి

క్యారెట్ తురుము - ఒక కప్పు
ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
కారం- అర టీ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీ స్పూన్ 
జీలకర్ర- అరటీ స్పూన్ 
ఇంగువ - చిటికెడు
కరివేపాకు-రెండు రెమ్మలు
శెనగపిండి- ఒక కప్పు 
ఉప్పు- తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

క్యారట్​ వడలు తయారీ విధానం 

క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఉప్పు, పసుపు గిన్నెలో వేసి బాగా కలపాలి. 

తర్వాత అందులో శెనగపిండి కూడా వేసి మరోసారి కలపాలి(క్యారిటీ తురుము, ఉల్లిగడ్డ తరుగులోని తడి వల్ల పిండి ముద్దలా అవుతుంది. అందుకని ప్రత్యేకంగా నీళ్లు కలపాల్సిన అవసరం లేదు).

 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి మరిగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే టేస్టీగా ఉండే క్యారట్​ వడలు తయారీ..

 క్యారట్​ పోలేలు తయారీకి కావాల్సినవి

 

  • క్యారెట్ తురుము - ఒక కప్పు 
  • మైదా- ఒకటిన్నర కప్పు
  • చక్కెర - అర కప్పు
  • యాలకుల పొడి- అర టీ స్పూన్
  • నెయ్యి- రెండు టేబుల్ స్పూను
  • ఉప్పు - చిటికెడు

క్యారెట్​ పోలేలు తయారీ విధానం

ముందుగా మైదాలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు పాన్​ లో  నెయ్యి కరిగించి క్యారెట్​ తురుము వేసి వేగించాలి. అందులో చక్కెర, యాలకుల పొడి కూడా వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆపాలి. 

కలిపి పెట్టిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజు పూరీలా వత్తి మధ్యలో క్యారెట్ మిశ్రమం పెట్టి మళ్లీ పోలేల్లా వత్తాలి. 

ఆపై వాటిని పెనంపై రెండు వైపులా నెయ్యితో కాల్చితే నోరూరించే క్యారెట్ పోలేలు రడీ.. పిల్లలే కాదు.. పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ ప్లేట్​ ఖాళీ చేస్తారుగా..!

క్యారట్​ మురబ్బా తయారీకి కావలసినవి

 

  • క్యారెట్ - అర కేజీ
  • నిమ్మరసం- పావు కప్పు

క్యారట్​ మురబ్బా తయారీ విధానం

క్యారట్​ లను చక్రాల్లా తరిగి మధ్యలో చాకుతో రంధ్రాలు చేయాలి. ముక్కల్ని ఐదునిమిషాలు నీళ్లలో ఉడికించి... గిన్నెలోకి తీయాలి పాన్​లో సరిపడా నీళ్లు పోసి చక్కెర వేసి తీగపాకం రెడీ చేయాలి.

 అందులో క్యారెట్ ముక్కలు కూడా వేసి సన్నని మంటపై ఉడికించాలి. పాకం క్యారెట్ ముక్కలకు బాగా పెట్టాక స్టవ్ ఆపాలి. 

తర్వాత అందులో నిమ్మరసం వేసి కాసేపు చల్లర్చి తగలని డబ్బాలోకి తీసి నిల్వ చేయాలి. ఇవి తింటే సూపర్​ గా ఉంటాయి.