Vinayakan Case: జైలర్ విలన్ తిక్కపనులు.. సోషల్ మీడియాలో మైనర్ బాలిక ఫోటో పోస్ట్.. వేధింపులపై కేసు నమోదు

Vinayakan Case: జైలర్ విలన్ తిక్కపనులు.. సోషల్ మీడియాలో మైనర్ బాలిక ఫోటో పోస్ట్.. వేధింపులపై కేసు నమోదు

జైలర్’ విలన్, మలయాళ నటుడు వినాయకన్‌ (Vinayakan) మరోసారి తన వక్రబుద్ధి చూపించారు. ఎప్పటికప్పుడు తన వికృతచేష్టలతో వరుస వివాదాల్లో నిలుస్తూ వస్తున్న వినాయకన్, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా మైనర్ బాలిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో కొత్త తలనొప్పి తెచ్చుకున్నారు. ఈ ఘటనతో వినాయకన్ పేరు మరోసారి సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే..

ఓ ఎనిమిదేళ్ల బాలిక ఫొటోతో పాటు ఆమె తండ్రి మొబైల్ నంబర్‌ను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై కేరళ పోలీసులు వినాయకన్‌పై  కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ ఆదేశాల మేరకు అలప్పుజా జిల్లా మావేలిక్కర పోలీసులు జూలై 8న కేసు నమోదు చేశారు. BNS, ఐటీ చట్టం, కేరళ పోలీస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన వివాదం

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 2025 జూలై 23న బాధితుడు, నటుడు వినాయకన్‌కు వాట్సాప్‌లో ఒక ఫేస్‌బుక్ పోస్టును ఫార్వర్డ్ చేశారు. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున వినాయకన్, ఆ బాధితుడు పంపిన వాట్సాప్ మెసేజ్‌తో పాటు అతని ప్రొఫైల్ ఫొటో (అందులో అతని ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది), మొబైల్ నంబర్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన వెరిఫైడ్ ఫేస్‌బుక్ ఖాతాలో అనుమతి లేకుండా పోస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు బాధితుడికి ఫోన్ చేసి దుర్భాషలాడారని, ఈ క్రమంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, మైనర్ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ఫిర్యాదులో తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, కేరళ పోలీస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వినాయకన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వినాయకన్‌పై గతంలో కూడా పరువునష్టం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తన తదితర ఆరోపణలతో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఈ ‘విలన్’కు వివాదాలు కొత్తేమీ కాదు:

‘జైలర్‌’లో విలన్‌గా నటించిన వినాయకన్‌ కు వివాదాలు కొత్త కాదు. 2023 అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగాడు. నటుడు వినాయకన్‌ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అపార్ట్‌మెంట్‌ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని నటుడు వినాయకన్ ను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అప్పుడు కూడా మద్యం మత్తులో ఉన్న వినాయకన్‌ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేకాకుండా 2024 సెప్టెంబర్‌లో వినాయకన్‌ హైదరాబాద్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

2025లో తన ఇంటి బాల్కనీ నుండి పొరుగు ఇంటివారితో గొడవ పడ్డారు. లుంగీ కట్టుకుని పక్కింటి వారితో అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పక్కింటి వారిపై ఇష్టానుసారంగా అరుస్తూ, బూతులు తిడుతూ దూకుడుగా ప్రవర్తించిన వినాయకన్ను.. పోలీసులు ఎన్నోసార్లు హెచ్చరించారు.. శిక్షించారు, అయినప్పటికీ వినాయకన్ ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. ఈ నేపథ్యంలో నటుడిగా తన మార్క్ను పూర్తిగా పోగొట్టుకుని కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడు.