
అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ చిత్రం ‘జానకి వెర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ప్రవీణ్ నారాయణ్ దర్శకుడు. జానకి అనే మహిళ చేసే న్యాయ పోరాటం ఈ చిత్ర కథ. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. సినిమా టైటిల్‌తో పాటు అనుపమ పోషిస్తున్న ‘జానకి’ పాత్ర పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. సీతా దేవికి మరో పేరైన జానకి అనే పేరును లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టడమే ఇందుకు కారణమని సమాచారం.
ఫిల్మ్ ఎంపాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్నికృష్ణన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పాత్ర పేరును, సినిమా టైటిల్‌ను మార్చాలని సెన్సార్ బోర్డు సూచించిందని ఆయన చెప్పారు. గతంలోనూ ఓ సినిమా విషయంలో ఇలాంటి సమస్య తలెత్తగా ‘జానకి’ పేరును జయంతిగా మార్చి సెన్సార్ పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనుపమ పాత్ర తరపున కోర్టులో న్యాయపోరాటం చేసే లాయర్‌గా కేంద్రమంత్రి సురేష్ గోపి ఈ చిత్రంలో నటించారు. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనేది మూవీ క్యాప్షన్. జూన్ 27న సినిమా విడుదల కావల్సి ఉంది. మరి తాజా పరిణామాల దృష్ట్యా ఆ తేదీకి వస్తుందో, ఆలస్యమవుతుందో చూడాలి!