Chakkora Review: ‘చకోర’ మూవీ రివ్యూ.. పూరి శిష్యుడి సినిమా ఎలా ఉందంటే?

Chakkora Review: ‘చకోర’ మూవీ రివ్యూ.. పూరి శిష్యుడి సినిమా ఎలా ఉందంటే?

శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన లవ్ స్టోరీ ‘చకోర’ (Chakkora). పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డా. చింతాడ హేమారావు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై బాపిరాజు శుక్రవారం (అక్టోబర్ 9, 2026న) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. స్వచ్ఛమైన ప్రేమ, జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఓ యువకుడి అవిశ్రాంత ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ‘చకోర’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సంభాషణలో ఒక ప్రేమకథ తెరపైకి వస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లి చూపించే జాబిల్లిని చూస్తూ పెరిగిన ఓ యువకుడి జీవితంలో ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనే అంశం చుట్టూ కథ సాగుతుంది. అతడికి చకోర పక్షిలా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలు అతడి జీవితాన్ని కొత్త మలుపులు తిప్పుతాయి.

తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని అతడు ఎంతో ప్రత్యేకంగా భావిస్తాడు. అయితే వారి మధ్య ప్రేమ అనుకున్నంత సులభంగా ముందుకు సాగదు. ఆ అమ్మాయి అతడికి దూరం కావడానికి కారణమేంటి? ఆమెను తన జీవితంలో భాగం చేసుకోవాలనే అతడి ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రేమకథలకు వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ప్రేమతో పాటు కుటుంబ అనుబంధాలు, స్నేహం, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదల కూడా తోడైతే ఆ కథకు మరింత భావోద్వేగం చేరుతుంది. అలాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’.

చకోర పక్షి జాబిల్లి కోసం పడే తపనను ప్రేమ, లక్ష్య సాధనతో ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన ఆసక్తికరం. ప్రేమ, త్యాగం, పట్టుదలతో పాటు తల్లి కొడుకుల అనుబంధం కథకు భావోద్వేగ బలాన్ని ఇస్తాయి. అయితే బలమైన కథాంశానికి మరింత పదునైన కథనం తోడై ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. కొన్ని సన్నివేశాల్లో నెమ్మదించే కథనం మినహా, ప్రేమను ఓ లక్ష్యంగా భావించే యువకుడి ప్రయాణమే సినిమాకు ప్రధాన ఆకర్షణ.

నటీనటుల నటన..

హీరోగా పరిచయమైన శ్రవణ్ ప్రేమ, భావోద్వేగాలు పలికించే పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. హీరోయిన్ మలైకా టి. వాసుపల్ తన నటనతో ఆకట్టుకున్నారు. సుమన్, ఎల్.బి. శ్రీరామ్ తమ అనుభవంతో పాత్రలకు సహజత్వాన్ని తీసుకురాగా, బ్రహ్మాజీ, ఇంద్రజ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నీకల్ అంశాలు:

దర్శకుడు మంగా శ్రీనివాస్ ప్రేమకథకు భావోద్వేగాలను జోడించే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం, రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ బాగుంది.