కొండ పోచమ్మ సాగర్ కట్టిందే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కోసం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 

కొండ పోచమ్మ సాగర్ కట్టిందే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కోసం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 
  • 58 ఎకరాల్లో చెరువు, మూడెకరాల్లో బావి తవ్వి పారించుకుంటున్నడు: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: కేవలం తన పామ్ హౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకే  కేసీఆర్​వేల కోట్ల రూపాయలతో కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం వెలుగు దిన పత్రికలో ‘కేసీఆర్​ ఫాంహౌస్​కు మళ్లిన కొండ పోచమ్మ’ వార్తా క్లిపింగ్​ను చూపిస్తూ  కొండపోచమ్మ సాగర్​ నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ కి నీటి మళ్లింపు జరిగిన తీరును వివరించారు.

కేసీఆర్ ఫామ్ హౌజ్ పక్కనే 58 ఎకరాల్లో పాండురంగ చెరువు తవ్వించారని, 2016కు ముందు అక్కడ ఎలాంటి చెరువు లేదన్నారు.  2017లో దీన్ని పూర్తిచేశాక కొండపోచమ్మ సాగర్​ నుంచి నీళ్లు మళ్లించి, నింపుకుంటున్నారని చెప్పారు. ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోని 3 ఎకరాల బావికి పంప్ చేస్తున్నారని తెలిపారు.  రైతుల పేరుతో రూ.45  కోట్ల 54 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారని,  ఇది కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పరాకష్టగా ఎంపీ చామల అభివర్ణించారు.

ఫామ్ హౌజ్ లోని 300 ఎకరాల అసైన్డ్ భూమిపై సర్వే చేస్తున్న సమయంలో కేసీఆర్ ఫామ్ హౌజ్ కు అక్రమ నీటి తరలింపు విషయం బయటకు వచ్చిందన్నారు. తన ఫామ్ హౌజ్ లోని ప్రతి ఎకరా పంటకు కోటి రూపాయలు వచ్చినట్లుగానే కాళేశ్వరం నీటితో ప్రతి రైతుకు కోటి రూపాయలు వస్తున్నాయని కేసీఆర్ అనుకుంటున్నాడేమోనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు అక్రమ నీటి తరలింపుపై ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని, ఇందులో ఇరిగేషన్ అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలు తవప్పని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నీళ్లను తన ఫామ్‌‌‌‌ హౌజ్ కు,  నియామకాలను  కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ లకు, నిధులు సొంత కుటుంబానికే మలుపుకున్నారని విమర్శించారు.