గోదావరి–కావేరి లింక్‌ ఇచ్చంపల్లి నుంచి వద్దు..చంద్రబాబు కొత్త ప్రతిపాదన

గోదావరి–కావేరి లింక్‌ ఇచ్చంపల్లి  నుంచి వద్దు..చంద్రబాబు కొత్త ప్రతిపాదన
  •     పోలవరం నుంచి తీసుకోవాలంటూ కేంద్రానికి ఏపీ సీఎం లేఖ
  •     ఎగువ నుంచి చేపడితే ఏపీకి నష్టమని చంద్రబాబు వాదన
  •     పోలవరం–బనకచర్లతో లింక్ చేస్తే ఖర్చు తగ్గుతదని సూచన
  •     సాగర్ ​బదులు బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా కావేరికి తరలించాలని ఒత్తిడి 
  •  

హైదరాబాద్​, వెలుగు: గోదావరి–కావేరి అనుసంధానాన్ని (జీసీ లింక్​) ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి నీటిని తీసుకెళ్తే ఏపీకి నష్టం జరుగుతుందని వాదించారు. జీసీ లింక్ సోర్సును మార్చాలని కోరుతూ ఇటీవల ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్​కు లేఖ రాశారు. పోలవరానికి ఎగువ నుంచి 148 టీఎంసీలను మళ్లిస్తే పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల ప్రణాళికాబద్ధ నీటి కేటాయింపులు, వినియోగంపై పెను ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. వర్షాకాలంలో పోలవరం డ్యామ్ సైట్ వద్ద వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, ఆ మిగులు జలాలనే కావేరి లింక్ ప్రాజెక్టుకు తరలిస్తే ఏ రాష్ట్రానికీ అభ్యంతరం ఉండదని చెప్పారు.  

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల దాహార్తి తీర్చేందుకు పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్​పీ)ని చేపట్టిందని, ఈ ప్రాజెక్టు రూపురేఖలు, అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్, నీటి రవాణా సామర్థ్యం.. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌తో అచ్చంగా సరిపోలుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఉమ్మడి కాలువలు, పనుల వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు వ్యయంలో మెజారిటీ వాటాను కేంద్ర జలశక్తి శాఖ లేదా నేషనల్​ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) నిధుల పరిధిలోకి తీసుకురావడానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఎవరి హక్కులకూ భంగం కలగకుండా ఐదు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు.

బొల్లాపల్లిని వాడుకోండి..

గోదావరి నుంచి తెచ్చే నీటిని నేరుగా నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌లో పోయడం సాంకేతికంగా సరికాదని, దానికి బదులు గుంటూరు/పల్నాడు సరిహద్దుల్లోని బొల్లాపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలని చంద్రబాబు లేఖలో సూచించారు. బొల్లాపల్లి కొండ శ్రేణుల మధ్యనున్న ఖాళీలను పూడ్చడం ద్వారా భారీ ‘ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బ్యాలెన్సింగ్ అండ్ క్యారీ ఓవర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌’ను ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఇది సాంకేతికంగా అత్యంత అనుకూలమైనదని, గోదావరి నుంచి వచ్చే నీటిని నిల్వ ఉంచేందుకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

పోలవరం–బనకచర్ల, గోదావరి–కావేరి ప్రాజెక్టుల ఏకీకరణ పూర్తయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత చేకూరుతుందని సీఎం తెలిపారు. తాగు, సాగునీటి కొరత తీరడంతో పాటు పారిశ్రామిక అవసరాలు, ‘బ్లూ రెవల్యూషన్’ కింద ఆక్వా రంగానికి అపార ప్రయోజనం కలుగుతుందన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు ఫేజ్-2 (పూర్తి స్థాయి సామర్థ్యం 45.72 మీటర్లు) పనులు పూర్తి చేయడానికి కేంద్రం రూ.42,500 కోట్లు వెంటనే రిలీజ్​ చేయాలని కోరారు. కాగా,  ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్​చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాటిమాటికీ లేఖలు, భేటీల ద్వారా కేంద్ర మంత్రులను ప్రభావితం చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.