73 ఏండ్ల వయసులో..రంగుల కల నెరవేరింది!

73 ఏండ్ల వయసులో..రంగుల కల నెరవేరింది!

ముంబైకి చెందిన చంద్రప్రభ పరిహార్ వయసు 73 ఏండ్లు. ఆమెకు చిన్నప్పటినుంచి కళలంటే ఇష్టం. ఆ ఇష్టంతో స్కూల్లో చదువుకునే రోజుల్లోనే క్రోషెట్ వర్క్‌‌ నేర్చుకుంది. కానీ.. ఆ తర్వాత పిల్లలు, సంసారం, మనవళ్లను చూసుకోవడం.. లాంటి బాధ్యతల వల్ల కళకు దూరమైంది. కానీ.. మూడు దశాబ్దాల క్రితం మళ్లీ స్టిచింగ్ కోర్సు చేసింది. కానీ.. బిజీలైఫ్​ వల్ల పని చేసేందుకు పెద్దగా టైం దొరకలేదు. అప్పుడప్పుడు సరదాగా తన, మనవళ్ల బట్టలు మాత్రం కుట్టేది. 

సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో కరోనా లాక్‌‌డౌన్‌‌ పెద్ద మార్పును తీసుకొచ్చింది. 2020 వరకు ఐటీ రంగంలో పనిచేసిన చంద్రప్రభ కోడలు స్వాతి కరోనా వల్ల జాబ్‌‌ వదిలేసి ఇంటికే పరిమితమైంది. అప్పటినుంచి కుటుంబ బాధ్యతలు తను కూడా పంచుకుంది. దాంతో చంద్రప్రభ జీవితంలో 30 ఏండ్ల తర్వాత మొదటిసారి కొంత ఖాళీ టైం దొరికింది. 

సరదాగా మొదలై.. 

ఆ కొద్ది టైంలోనే చంద్రప్రభ తన కళకు ప్రాణం పోశారు. అందమైన డిజైన్లతో క్రోషెట్స్‌‌ చేశారు. కోడలు స్వాతికి కూడా అవి బాగా నచ్చాయి. దాంతో ఆమె వాటిని ఫొటోలు, వీడియోలు తీసి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. మొదటి వీడియోకు 50 లైక్స్‌‌ వచ్చినా ఆమెకు చాలా ఆనందమేసింది. కొందరు వాటిపై ఆసక్తి చూపించడంతో ఆన్‌‌లైన్‌‌లో అమ్మడం మొదలుపెట్టారు. అలా క్రమంగా ఆర్డర్లు పెరగడంతో 2023లో అధికారికంగా ‘నయ్​హర్’ బ్రాండ్‌‌ను ప్రారంభించారు.

దేశ, విదేశాల్లో డిమాండ్‌‌

నయ్​హర్‌‌‌‌ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ పేజీకి ప్రస్తుతం 1.68 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నెలకు సుమారు 50 కస్టమైజ్డ్‌‌ ఆర్డర్లు వస్తున్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా బ్రిటన్‌‌, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, పోలండ్.. ఇలా మొత్తం ఆరు దేశాలకు ప్రొడక్ట్స్‌‌ షిప్పింగ్‌‌‌‌ చేస్తున్నారు. ముఖ్యంగా జాకెట్లు, బ్యాగ్‌‌లు, టోపీలు, స్కార్ఫ్‌‌లు, కస్టమ్ పీసెస్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. 

ప్రయోగాలు చేయడమంటే ఇష్టం.. 

చంద్రప్రభకు ఇప్పటికీ కొత్త డిజైన్లు నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటుంది. తాను చేసిన అత్యంత కఠినమైన డిజైన్‌‌ను గుర్తుచేసుకుంటూ ‘‘ఒక కస్టమర్ అలియా భట్‌‌ వేసుకున్న జాకెట్‌‌ లాంటిదే అల్లి ఇవ్వమని అడిగారు. అప్పటివరకు నాకు అలాంటివి డిజైన్‌‌ చేసిన అనుభవం లేదు. పైగా అది చాలా కష్టమైన డిజైన్‌‌. ముఖ్యంగా మెడ భాగం అల్లడం చాలా కష్టంగా అనిపించింది. అయినా కస్టమర్‌‌‌‌కు నచ్చేలా తయారుచేసి ఇచ్చా. నేను కొత్త డిజైన్‌‌ను ట్రై చేసేందుకు ఎప్పుడూ భయపడను. నేను చేయగలననే నమ్మకం నాలో ఎప్పుడూ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది చంద్రప్రభ. ఆ తర్వాత ఆ జాకెట్‌‌ వాళ్ల బెస్ట్‌‌ సెల్లర్స్‌‌ లిస్ట్‌‌లో చేరిపోయింది. 

కోడలి సాయంతో.. 

“క్రోషెట్ బిజినెస్‌‌లో భాగమవ్వాలంటే నీకు నీకు అల్లికలు రావాలి” అని కోడలికి సలహా ఇచ్చింది చంద్రప్రభ. అందుకే స్వాతి కూడా చంద్రప్రభ దగ్గరే క్రోషెట్ వర్క్‌ నేర్చుకుంది. ఇప్పుడామె ఇన్‌‌స్టాగ్రామ్ మేనేజ్‌‌మెంట్, ఆర్డర్లు, షిప్పింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ లాంటివి చూసుకుంటుంది. “మా అత్తగారి దగ్గర నేను క్రోషెట్‌‌ స్కిల్స్‌‌ మాత్రమే కాదు.. కష్టపడి పనిచేయడం నేర్చుకున్నా” అంటుంది స్వాతి. 

క్వాలిటీ.. 

“నా బర్త్‌‌డే కోసమని ఒక జాకెట్ ఆర్డర్ చేశా. స్వాతి, బ్రాండ్‌‌తో ఉన్న ఎక్స్‌‌పీరియెన్స్ నేను మర్చిపోలేను. డిజైన్‌‌ చేస్తున్నప్పుడు ప్రతి దశలో నా అభిప్రాయం అడిగారు. ప్రేమగా మాట్లాడారు. ఇంత ప్రేమతో తయారైన దుస్తులు వేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఎఫర్ట్.. అన్నీ బాగున్నాయి”అని కస్టమర్ దీపికా శర్మ చెప్పారు.

ఆ ఇంట్లోకి వెళ్లగానే రంగురంగుల ఉన్ని దారాలు వెల్‌‌కమ్‌‌ చెప్తుంటాయి. ఏ గోడకు చూసినా అందమైన క్రోషెట్స్​ వేలాడుతుంటాయి. అవన్నీ కొనుక్కొచ్చి తగిలించినవి కాదు.. చంద్రప్రభ కస్టమర్ల కోసం డిజైన్‌‌ చేసినవి. ఆమె 73 ఏండ్ల వయసులో ఆ రంగుల ప్రపంచాన్ని నిర్మించుకుంది. నచ్చిన పని చేస్తూ.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రేమ, జ్ఞాపకాలు, కళను మిళితం చేసి నేసిన ఆ క్రోషెట్స్​ మన దేశంలోనే కాకుండా ఆరు విదేశాల్లో అమ్ముడవుతున్నాయి. 

వయసు కేవలం సంఖ్య మాత్రమే!

‘‘నేను క్రోషెటింగ్‌‌ని వ్యాపారంగా ప్రారంభించి మూడు సంవత్సరాలు అయ్యింది. అప్పటినుంచి ప్రతిరోజూ కుట్లు, ఎంబ్రాయిడరీ పని చేస్తున్నా. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌‌ని కలిసినప్పుడు వాళ్లు ‘ఇక రెస్ట్‌‌ తీసుకో. ఇంకా ఎన్నాళ్లు పనిచేస్తావు’ అంటుంటారు. కానీ.. నాకు పనిచేయడం ఇష్టం. అది నా మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుతుంది. వయసు కేవలం సంఖ్య మాత్రమే. నాకు చేతనైనన్ని రోజులు పని చేస్తా” అంటున్నారు చంద్రప్రభ. అలా పనిచేయడం వల్లే ఆమెకు 2025 మార్చిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘సీనియర్ ఎంటర్‌‌ప్రెన్యూర్’ విభాగంలో లోక్‌‌మాత అహల్యాబాయి హోల్కర్ అవార్డు దక్కింది.