హైదరాబాద్ ఓఆర్ఆర్ పైనుంచి పడ్డ కెమికల్ ట్యాంకర్... వాహనాన్ని తొలగిస్తుండగా మంటలు

హైదరాబాద్ ఓఆర్ఆర్ పైనుంచి పడ్డ కెమికల్ ట్యాంకర్... వాహనాన్ని తొలగిస్తుండగా మంటలు

శామీర్ పేట, వెలుగు: శామీర్​పేట పోలీస్​స్టేషన్​పరిధిలోని హైదరాబాద్​ ఔటర్​రింగ్​రోడ్డు పైనుంచి ఓ కెమికల్​ట్యాంకర్​కిందపడింది. వాహనాన్ని తొలగిస్తుండగా కెమికల్ లీకై, మంటలు వ్యాపించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ మహమ్మద్ ఫయాజ్ సోమవారం ముంబై నుంచి హైదరాబాద్​లోని అల్మెలో కంపెనీకి కెమికల్​తీసుకువస్తున్నాడు. మార్గమధ్యలో మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. 

దీంతో శామీర్ పేట్ నుంచి కీసర వైపు వెళ్లే సర్వీస్ రోడ్డులో ట్యాంకర్ ఓఆర్ఆర్ పైనుంచి కింద పడిపోయింది. మంగళవారం ఉదయం ట్యాంకర్ యజమాని బిలాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా క్రేన్ సహాయంతో దాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు. కానీ ట్యాంకర్​లోని కెమికల్​లీకై, మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను ఆర్పివేశారు. ప్రాణనష్టం జరగలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.