V6 News

సెంచరీతో చెలరేగిన సంజు.. ముంబై ముందు భారీ టార్గెట్!

సెంచరీతో చెలరేగిన సంజు.. ముంబై ముందు భారీ టార్గెట్!

MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 'ఎల్-క్లాసికో'లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆశించిన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (14), శివమ్ దూబే (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో చెన్నై ఒక దశలో కష్టాల్లో పడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్ మాత్రం ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ (11 బంతుల్లో 21) మంచి క్యామియోతో ఆకట్టుకున్నాడు. మధ్యలో జేమీ ఓవర్టన్ కూడా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు జోడించడంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే, పూర్తి బాధ్యతను భుజానికెత్తుకున్న సంజూ శాంసన్, గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో తన క్లాస్ చూపిస్తూ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో చెన్నై జట్టు ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఉంచగలిగింది. 

ఇక ముంబై బౌలర్లలో ఏఎం ఘజన్‌ఫర్, అశ్వనీ కుమార్ చెరో రెండు వికెట్లు తీయగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే సొంత గడ్డపై 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఎలా ఛేదిస్తుందో అనేది వేచి చూడాలి.. హార్డిక్ సేన ఈ రన్ ఛేజ్‌లో ఏ మేరకు రాణిస్తుందోనని ముంబై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.