‘జాతి బేధం లేని ప్రేమ’: తాబేలుకు యాపిల్ పెడుతున్న చింపాంజీ వీడియో వైరల్

‘జాతి బేధం లేని ప్రేమ’: తాబేలుకు యాపిల్ పెడుతున్న చింపాంజీ వీడియో వైరల్

పంచుకుంటే ప్రేమ మరింత పెరుగుతుంది. మనుషులే కాదు జంతువుల్లోనూ ఈ ప్రేమ భావన ఉంటుందని చాటుతోంది ఈ వీడియో. జాతులు వేరైనా తనకు దొరికిన ఓ పండును మరో జంతువుతో పంచుకుంటూ గొప్ప మెసేజ్ ఇచ్చాయి. ఓ తాబేలుకు చింపాంజీలు యాపిల్ పెట్టి దాని ఆకలి తీర్చాయి. తోటి వారికి జాతి బేధం లేకుండా ఆకలి తీర్చడానికి మించిన మేలు లేదన్న సందేశాన్ని ఇస్తున్న ఈ వీడియో.. ఎవరో టిక్‌టాక్‌లో పెట్టారు. ఇది తరచూ జంతువులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా దృష్టిలో పడింది. చింపాంజీ యాపిల్ తింటూ తాబేలుకు ఓ బైట్ తినిపిస్తున్న ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పంచుకోవడం ద్వారానే ప్రేమ పెరుగుతుందంటూ క్యాప్షన్‌ పెట్టి దాన్ని పోస్ట్ చేశారాయన.

ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. జాతులు వేరైనా కలిసి మెలిసి బతకాలన్న సందేశాన్ని ఆ జంతువులు ఇస్తున్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వాటి బంధం సూపర్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ వీడియో అద్భుతంగా ఉంది. చాలా సంతోషాన్ని నింపింది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ఇదే తీరుగా మనుషులు కూడా ఉంటే జాతి వివక్ష లాంటివి అంతమవుతాయి’ అని మరో నెటిజన్ అన్నాడు. 24 గంటల్లో ఈ వీడియోను దాదాపు 17 వేల మంది చూశారు. 2 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు.