నాటునాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. చిరు ప్రశంసలు

నాటునాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. చిరు ప్రశంసలు

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన RRR లోని 'నాటు నాటు' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. దాంతో పాటు ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్‌ అయింది.

 నాటు నాటు సాంగ్ కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.  ఇది ఎంతో అపూర్వమైన, చారిత్రాత్మక విజయమని అన్నారు. కీరవాణికి, మూవీ టీమ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ ప్రశంసలు గుప్పించారు. దాంతో పాటు అవార్డ్స్ ఫంక్షన్ లో కీరవాణి మాట్లాడుతున్న ఫొటోను చిరు షేర్ చేశారు.

నాటు నాటు సాంగ్ కు దేశమే కాదు యావత్ ప్రపంచమే  ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తుందన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు   చంద్రబోస్, కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో డైరెక్టర్ రాజమౌళి, నటుసు రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. 'నాటు నాటు'కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌ చప్పట్లు కొడుతూ సందడి చేశారు.