క్లోరోఫామ్ గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి..సరాకా ల్యాబొ రేటరీ లో ఘటన

క్లోరోఫామ్ గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి..సరాకా ల్యాబొ రేటరీ లో ఘటన
  •     మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 లక్షల చొప్పున పరిహారం

మెదక్/ జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సరాకా ల్యాబొరేటరీస్‌‌ పరిశ్రమలో క్లోరోఫామ్ గ్యాస్‌‌ లీకేజీ వల్ల  ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పరిశ్రమలోని ప్రొడక్షన్‌‌ బ్లాక్‌‌–2లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత  అకస్మాత్తుగా గ్యాస్‌‌ పైపులైన్‌‌ నుంచి క్లోరోఫామ్‌‌ వాయువు లీకైంది. విధుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పంగ సుదర్శన్‌‌రావు (43), విజయనగరం జిల్లాకి చెందిన కీలపర్తి బాలాజీ (29) అస్వస్థతకు గురై కుప్పకూలారు. 

వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్‌‌లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలానికి డీఎస్పీ ప్రభాకర్, సీఐ నాగార్జునగౌడ్, ఎస్సై హనుమంతు చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సరాక లాబరేటరీకి చేరుకొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. అనంతరం యాజమాన్యంతో మాట్లాడి, మృతుల కుటుంబాలకు రూ.70 లక్షలు పరిహారం, అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ. లక్ష అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  

రూ. కోటి పరిహారం ఇవ్వాలి: హరీశ్​రావు 

సరాక ల్యాబరేటరీస్‌‌ లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో చనిపోయిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు రూ. కోటి  ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

విద్యుత్ సరఫరా నిలిపివేత

సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ ను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. పీసీబీ అధికారులు పరిశ్రమను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమకు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సంగారెడ్డి టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించింది.