లేబర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేయాలి : సీఐటీయూ

లేబర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేయాలి : సీఐటీయూ
  • కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి
  • ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌‌‌లో  సీఐటీయూ మహాధర్నా

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వాటినే మార్చే దిశగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.  లేబర్ కోడ్స్‌‌‌‌ను రద్దు చేయాలని, నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, ఉద్యోగ–సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌‌‌‌ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌‌‌లో మహాధర్నా నిర్వహించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్​ను పూర్తిగా ధ్వంసం చేసి ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేలు, విమానయానం, పోర్టులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడిదారుల లాభాల కోసమే పనిగంటలు పెంచేలా 4 లేబర్ కోడ్‌‌‌‌లను తెచ్చారన్నారు.

ప్రధాన కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీలకు కనీస వేతనాల సలహా మండలిలో చోటు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ పేర్లతో శ్రమదోపిడీ పెరిగిపోయిందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్య, నియంతృత్వ విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు.