సర్ రద్ కరో.. జ్ఞానేశ్ గద్దీ ఛోడో.. బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో సీజేపీ భారీ నిరసన

సర్ రద్ కరో.. జ్ఞానేశ్ గద్దీ ఛోడో.. బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో సీజేపీ భారీ నిరసన

బెంగళూరు: భారత ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)డిమాండ్ చేసింది. జ్ఞానేశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది పౌరుల ఓటు హక్కును అన్యాయంగా రద్దు చేశారని ఆరోపించింది.

గురువారం కర్నాటకలోని బెంగళూరులో ఉన్న ఫ్రీడమ్ పార్క్‌‌‌‌లో సీజేపీ భారీ నిరసన చేపట్టింది. ఈ ఆందోళనలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే, ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‎తో పాటు పెద్ద సంఖ్యలో బాధితులు, సామాజిక సంస్కర్తలు, వేలాది మంది యువత పాల్గొన్నారు.  నిరసనలో పాల్గొన్నవారు చేసిన "సర్ రద్ద్ కరో.. జ్ఞానేశ్ గద్దీ ఛోడో" అనే నినాదంతో ఫ్రీడమ్ పార్క్‌‌‌‌ దద్దరిల్లింది.

అనంతరం  అభిజిత్ దిప్కే మాట్లాడుతూ..బతికి ఉన్న మనుషులను సైతం ఓటర్ జాబితాలో చనిపోయినట్లు, వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు తప్పుగా చూపి ఓట్లు తొలగించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యువతను కాక్రోచ్‌‌‌‌లుగా భావిస్తోందని, వాటిలాగే, తాము పట్టుదలతో ప్రజాస్వామ్య రక్షణకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

మా నిరసన ప్రజాస్వామ్యం కోసమే

యూట్యూబర్ ధృవ్ రాఠీ మాట్లాడుతూ..తమ ఆందోళన రాజకీయ మార్పు లేదా గవర్నమెంట్ మార్పు కోసం కాదని తెలిపారు. తమది కేవలం ప్రజాస్వామ్యాన్ని రక్షించే పోరాటమేనని స్పష్టం చేశారు. సర్ వ్యవహారంలో ఈసీఐ నుంచి కనీస పారదర్శకత, జవాబుదారీతనం లేవని తప్పుపట్టారు. కర్నాటకలోని 100 పోలింగ్ స్టేషన్లలో జరిగిన సర్ అవకతవకలపై ప్రత్యేకంగా ఒక నివేదికను కూడా రాఠీ విడుదల చేశారు. 

సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం దేశానికే అవమానం తెచ్చిపెట్టిందని నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు." ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం.. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. కానీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో అధికారులు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిబంధనల వల్ల అర్హులైన కోట్ల మంది ఓట్లు తొలగిపోతున్నాయి. దీనివల్ల ఎవరు ఓటు వేయాలి? ఎవరు వేయకూడదు? అనేదానిని ఓటర్లు కాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వమే పరోక్షంగా నిర్ణయిస్తున్నారు" అని మండిపడ్డారు. 

కేవలం జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను తొలగించడం వల్ల ప్రయోజనం లేదని, అసలు లక్ష్యం సర్ ప్రాసెస్ ను రద్దు చేయడమేనని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఓటు కోల్పోయిన కొందరు బాధితులు మాట్లాడుతూ.. తాము ఏండ్లుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డ్రాఫ్ట్ రోల్స్ నుంచి తమ పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తప్పుడు వివరాలు చేర్చి తమ ఓటును తీసేశారని పేర్కొన్నారు. కాగా..నిరసన అనంతరం మహిళా భద్రతకు సంఘీభావంగా చప్పల్ ప్రొటెస్ట్ చేశారు. ఇందులో భాగంగా నిరసనకారులు చేతుల్లో చెప్పులు పట్టుకుని, మహిళలను అణచివేయాలని చూసేవారిపై చెప్పులు ఉపయోగించాలంటూ నినాదాలు చేశారు.