సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు.. ఐదు రోజుల జ్యూడిషియల్ కస్టడి..తిహార్ జైలుకు తరలింపు

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు.. ఐదు రోజుల జ్యూడిషియల్ కస్టడి..తిహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల క్రమంలో అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. డీ-నోటిఫై చేయబడిన జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలోకి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలతో కలిసి చొరబడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలుసౌరవ్ దాస్ , అశుతోష్ రాంకాలను బుధవారం ఓ ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (SEM) ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి తిహార్ జైలుకు తరలించారు. 

ముందస్తు అరెస్టు చర్యల్లో భాగంగా బుధవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ముందు ప్రవేశపెట్టగా ఈ 5 రోజుల కస్టడీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల లిస్టునుంచి తొలగించిన మరుసటి రోజే రూల్స్ ఉల్లంఘించి జాతీయ జెండాలతో అక్కడి గేట్లు, బారికేడ్లను దాటుకుని లోపలికి ప్రవేశించారని ఆరోపణలతో మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. 

సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది అభిష్త్ హెలా మాట్లాడుతూ..అకారణంగా 5రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ప్రజలను జంతర్ మంతర్ కు రావాలని ఫోన్ చేసి పిలిచారని పోలీసులు కోర్టులో అబద్దం చెప్పారు. నిజానికి అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లు ఎలాంటి ఫోన్ కాల్ చేయలేదని అయినప్పటికీ తప్పుడు ఫిర్యాదుతో వారిని 5 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారని అన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.