- డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు హాజరు
- చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు
- స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జమ్మి పూజ
- కల్వకుర్తి, జడ్చర్లలో రావణ దహనం
హైదరాబాద్, వెలుగు: కర్నాటక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రక మైసూరు దసరా ఉత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కర్నాటక సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన జంబూ సవారీని ప్రత్యక్షంగా తిలకించారు. అందంగా ముస్తాబు చేసిన గజరాజుపై 750 కిలోల బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో నమస్కరించారు.
కన్నడ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన జానపద కళాకారుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, సంగీత, నృత్య బృందాల ప్రదర్శనలు, శకటాల ఊరేగింపును ఆసక్తిగా వీక్షించారు. కేరళ సీఎం వీడీ సతీశన్తో పాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఉత్సవాలను ఆస్వాదించారు. కర్నాటక రాష్ట్ర పండుగ (నాడ హబ్బ)గా పేరొందిన ఈ దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి అద్దంపట్టేలా సాగాయి.
చాముండేశ్వరి ఆలయంలో పూజలు
మైసూరు రాజభవనం ప్రాంగణంలో జరిగే ప్రధాన ఉత్సవాలకు వెళ్లడానికి ముందు, కొండపై ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. గర్భగుడిలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో కుటుంబసమేతంగా పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సొంత ఊరికి వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. డప్పుల చప్పుళ్లు, భారీ గజమాలలు, పూల జల్లుల నడుమ గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
తొలుత కుటుంబసభ్యులతో కలిసి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, అనంతరం గ్రామదేవత కోట మైసమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత విజయదశమి సంప్రదాయం ప్రకారం జమ్మి పూజ కోసం గ్రామస్థులతో కలిసి కాలినడకన బయలుదేరారు. దారిలో స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన రేవంత్, జమ్మిచెట్టు వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులతో జమ్మి ఆకులు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కల్వకుర్తి, జడ్చర్లలో రావణ దహనం
కొండారెడ్డి పల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కల్వకుర్తి, జడ్చర్ల పట్టణాల్లో నిర్వహించిన దసరా వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ప్రజల హర్షధ్వానాల నడుమ రావణ దహనాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం, ఈ పండుగ పాలమూరు జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో పల్లెలు కళకళలాడాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్న రేవంత్ రెడ్డి, అక్కడి దసరా వేడుకల్లోనూ పాల్గొని రావణ దహన ఘట్టాన్ని వీక్షించారు.
