- రంగంలోకి ఇరిగేషన్, రెవెన్యూ, హార్టికల్చర్ శాఖలు
- ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ప్రాథమిక నివేదిక
- ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనకు ఉద్యానశాఖ అధికారులు
- పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు హార్టికల్చర్ నిధుల వినియోగం!
- విచారణకు సహకరించని కేసీఆర్ ఫాంహౌస్ సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫాంహౌస్‌కు నీటి మళ్లింపుపై సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నెల 17న ‘వెలుగు’ దినపత్రిక మొదటి పేజీలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఆరా తీసిన సీఎం.. క్షేత్రస్థాయిలో పర్యటించి, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్, రెవెన్యూ, హార్టికల్చర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్, దాని డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను క్షేత్రస్థాయిలోపరిశీలిస్తున్నారు. అటు పాండురంగ చెరువు నుంచి ఫాంహౌస్‌లోకి నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు ఉద్యానశాఖనిధులు వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌లో భాగంగా ఈ చెరువు నుంచి 1 ఆర్, 5 ఆర్ అనే డిస్ట్రిబ్యూటరీల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందుతుండగా..ఇందులో 1 ఆర్ డిస్ట్రిబ్యూటరీ పూర్తిగా కేసీఆర్ ఫాంహౌస్లోకే మళ్లినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు గుర్తించారు.
ఫాంహౌస్ లోపలి పరిస్థితేంటో తెలుసుకునేందుకు సాగునీటి శాఖ సిబ్బంది ప్రయత్నిస్తుండగా, కేసీఆర్ మనుషులు లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఫాంహౌస్ సిబ్బంది తమను గేట్వద్దే ఆపేస్తుండడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీస్బలగాల సాయంతో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ కోసం వేచిచూస్తున్నట్లు చెప్తున్నారు.
కేసీఆర్ ఫాంహౌస్‌కు తప్ప మిగితా ఒక్క ఎకరా పారలే
కొండ పోచమ్మసాగర్ కట్టింది ఒక్క కేసీఆర్ ఫాంహౌస్కోసమే కాదని, ఆ రిజర్వాయర్ నుంచి యాదాద్రి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నదని కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఇరిగేషన్ ఆఫీసర్లు సీఎంకు ఇచ్చే నివేదికలో పూర్తి వివరాలు పొందుపరున్నారు. వాస్తవానికి కొండపోచమ్మసాగర్ కింద 6 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీళ్లివ్వాల్సి ఉంది.
కానీ ఈ రిజర్వాయర్ కింద చెరువులు నింపే రెండు ప్రధాన కాల్వలు తప్ప.. పొలాలకు నీళ్లుపారించే డిస్ట్రిబ్యూటరీలను నేటికీ నిర్మించలేదని ఇరిగేషన్ ఆఫీసర్లు తేల్చారు. ఆ రిజర్వాయర్ ద్వారా కేసీఆర్ఫాం హౌస్‌కు తప్ప ఇతర రైతులకు చెందిన ఏ ఒక్క ఎకరాకూ నేరుగా నీళ్లు పారడం లేదని గుర్తించారు. ఇక లింక్ 4లోని ప్యాకేజ్ 14లో భాగమైన కొండపోచమ్మసాగర్‌కు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలించాల్సి ఉంటుంది.
ఈ రిజర్వాయర్ కింద మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ భాగం ఆయకట్టు ఉంది. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం పరిధిలోని కేవలం 34 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా.. పూర్తి యాదాద్రి జిల్లాకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఈ జిల్లా పరిధిలోని గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నేరుగా మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలిస్తారు. కానీ ఇంతవరకు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులే పూర్తికాలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. గంధమల్ల రిజర్వాయర్‌కు ఈ మధ్యే భూమి పూజ జరిగింది. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయినా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం మొదలు కాలేదు.
అప్పట్లో బీఆర్ఎస్ నేతల జోక్యంతో పక్కపక్కనున్న భూముల పరిహారంలో తేడాలు వచ్చేసరికి భూసేకరణ తోపాటు కాల్వల నిర్మాణమూ ఆగిపోయింది. దీంతో ఆ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నామన్న బీఆర్ఎస్ నేతల ప్రచారం ఉత్తదేనని ఇరిగేషన్‌శాఖ ఫీల్డ్ సర్వేలో స్పష్టమైనట్లు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకునేలా డిజైన్ చేసిన కొండపోచమ్మ సాగర్‌ను మల్లన్నసాగర్కన్నా ముందే పూర్తిచేశారు. అక్కడికి నీళ్లు తరలించేందుకు మల్లన్న సాగర్ మధ్యలోంచి భారీ కెనాల్‌ను తవ్వినట్లు ఇరిగేషన్ఆఫీసర్లు గుర్తించారు. ఇ
దే అంశాన్ని నివేదికలో పొందుపరచనున్నట్లు తెలిసింది. ఇక 2016కు ముందు ‘పాండురంగ చెరువు’ లేదని, ఆ తర్వాత 58 ఎకరాల అసైన్డ్ భూముల్లో చెరువు తవ్వింది నిజమేనని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులు జాయింట్ సర్వే ద్వారా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందుకు సంబంధించి పాత, కొత్త గూగుల్మ్యాప్లను ఆధారాలుగా సమర్పించనున్నట్లు సమాచారం.
హార్టికల్చర్ నిధుల మళ్లింపుపై ఇవాళ ఎంక్వైరీ
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.50 కోట్లకుపైగా హార్టికల్చర్నిధులను మళ్లించారనే ఆరోపణలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యానశాఖ ఇవాళ విచారణ చేపట్టనుంది. 2016లో మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మోడల్ విలేజీలుగా గుర్తించి, వాటి పరిధిలోని 3 వేల ఎకరాలకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం 2016, 2017లో మూడు జీవోలు ఇచ్చారు.
మొదట్లో 42.54 కోట్లతో పాలన అనుమతి ఇచ్చి, తర్వాత రూ.49.89 కోట్లకు పెంచారు. మూడు నెలల్లోనే అంచనాలు రూ.7.35 కోట్లకు పెంచారు. ఈ అధికార దుర్వినియోగంపై నిజానిజాలు నిగ్గుతేల్చాలన్న సర్కారు ఆదేశాలతో హార్టికల్చర్ శాఖ అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనపై ఇప్పటికే సిద్దిపేట కలెక్టర్‌కు సమాచారమిచ్చారు.
ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఫాంహౌస్‌లోకి కేసీఆర్ సిబ్బంది అనుమతించకపోవడంతో హార్టికల్చర్అధికారులను అనుమతిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే తమ వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను క్షేత్రస్థాయితో పోల్చి చూసి పూర్తిస్థాయి నివేదిక అందజేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
