నేరస్తులపై ఉక్కుపాదం.. బాధితులతోనే  ఫ్రెండ్లీ పోలీసింగ్.. భూకబ్జాదారులు, కల్తీ రాయుళ్లను వదలొద్దు: సీఎం

నేరస్తులపై ఉక్కుపాదం.. బాధితులతోనే  ఫ్రెండ్లీ పోలీసింగ్.. భూకబ్జాదారులు, కల్తీ రాయుళ్లను వదలొద్దు: సీఎం
  • రెండేండ్లలో  పోలీసు శాఖలో పూర్తిస్థాయి నియామకాలు
  • పోలీసు అమరుల పరిహారం రూ.2 కోట్ల వరకు పెంపు
  • హోంగార్డుల ఎక్స్‌‌‌‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచుతం
  • పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: అక్రమార్కులు, నేరగాళ్లు, భూకబ్జాదారులు, ఆహార కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. సమస్యలతో పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వచ్చే బాధితులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం గోషామహల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 

డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మృతి చెందిన ఏఎస్‌‌‌‌ఐ దేవ్ సింగ్, కానిస్టేబుళ్లు ప్రమోద్ కుమార్, శీలం కమలాకర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘అమరులు వీరు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, రాష్ట్రాభివృద్ధిలో పోలీసుల సేవలు ఎంతో కీలకమన్నారు. ‘మీ క్రమశిక్షణే మీ బలం. మీ నిజాయితీయే మీ ఆత్మగౌరవం. ప్రజలకు మీరు అందించే భరోసాయే మీకు దక్కే గొప్ప గుర్తింపు. ప్రజల భద్రతకు మీరు అండగా నిలవండి. మీ సంక్షేమానికి, మీ కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని పోలీసు సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.

బాధితుల్లో మీ కుటుంబాన్ని చూడండి

పోలీసులు విచక్షణాధికారాన్ని సక్రమంగా ఉపయోగించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడేవారు, భూకబ్జాదారులు, డ్రగ్స్ ముఠాలు, ఆహార కల్తీదారులతో కఠినంగా ఉండాల్సిందేనని, అప్పుడే నేరాలు తగ్గుతాయని అన్నారు. ‘మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వెళ్లినప్పుడు అవమానం ఎదురైతే మీకు ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. 

బాధితుల్లో మీ కుటుంబ సభ్యులను చూసుకుంటే తప్పకుండా సమస్యకు పరిష్కారం చూపుతారు’ అని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.  షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూనే, ఈ ఏడాది మార్చిలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని, ఏప్రిల్‌‌‌‌లో అత్యవసర రక్షణ కోసం ‘స్పందన – తక్షణ రక్షణ’ బృందాలను ప్రారంభించామన్నారు. 

మహిళలు, చిన్నారుల కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలని, న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదని, మహిళల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పోలీసు శాఖలో యువరక్తం

పోలీసు శాఖను మరింత బలోపేతం చేస్తూ యువరక్తాన్ని నింపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా 112 మంది యువ డీఎస్పీలను నియమించామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 అక్టోబర్ నాటికి దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్‌‌‌‌ఐలను నియమించామని, 2026లో 4,773 కానిస్టేబుళ్లు సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది మరో 5 వేల పోస్టులు భర్తీ చేశామని, మిగిలిన ఖాళీలను విడతలవారీగా 2028 నాటికి పూర్తిగా భర్తీ చేసి పోలీసుల కొరత లేకుండా చూస్తామని ప్రకటించారు. 

ట్రాన్స్‌‌‌‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామన్నారు. మారుతున్న కాలంతో పాటు నేర స్వభావం మారుతోందని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. సాంకేతికత ఎంత పెరిగినా పోలీసుల్లో మానవీయ దృక్పథం మారకూడదన్నారు. 

గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారిందని, డ్రగ్స్ నియంత్రణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. డ్రగ్స్ కట్టడిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఈగల్ ఫోర్స్‌‌‌‌ను అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు టీజీ మార్స్‌‌‌‌ను, ఆహార కల్తీ అణచివేతకు టీజీ సేఫ్‌‌‌‌ను తీసుకొచ్చామని తెలిపారు.

అమరుల కుటుంబాలకు సర్కారు అండ

సమాజం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సీఎం అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.  రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లకు గతంలో రూ.40 లక్షలుగా ఉన్న ఎక్స్‌‌‌‌గ్రేషియాను రూ.కోటికి పెంచామని తెలిపారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌‌‌‌ఐలకు రూ.45 లక్షల నుంచి రూ.కోటికి, ఎస్‌‌‌‌ఐలకు రూ.45 లక్షలు, ఇన్‌‌‌‌స్పెక్టర్లకు రూ.50 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులకు రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు, ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పరిహారం పెంచామని వివరించారు. 

ఇది కేవలం ఆర్థిక సహాయం కాదని, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలకు అవకాశం కల్పిస్తూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌‌‌‌ను ప్రారంభించామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించే హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశించారు.