శతాబ్దం గడిచినా పండుగ సాయన్నను ప్రజలు గుర్తు పెట్టుకున్నారు: సీఎం రేవంత్ 

శతాబ్దం గడిచినా పండుగ సాయన్నను ప్రజలు గుర్తు పెట్టుకున్నారు: సీఎం రేవంత్ 

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగానిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం ( అక్టోబర్ 22 ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పండుగ సాయన్న జయంతిని గతంలో ఎవరూ అధికారికంగా నిర్వహించలేదని... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. శతాబ్దం గడిచినా పండుగ సాయన్న ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు.

కొడంగల్ లో అత్యధిక జనాభా ముదిరాజ్ లదే అని... ముదిరాజ్ లు అండగా ఉంటే ఏదైనా సాధిస్తామని తన నమ్మకమని అన్నారు సీఎం రేవంత్. జమీందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాడారని.. ఒక దళాన్ని నిర్మించుకొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని...ఎన్నో అరాచకాలను ఎదురించి పేదలకు అండగా నిలిచారని అన్నారు. 40 ఏళ్ళు నిండకుండానే సాయన్నను ఉరి తీసారని అన్నారు.

తెలంగాణలో కులగణన చేసి తమ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కులగణనలో కుటుంబ వివరాలు లేకుంటే మళ్ళీ మీ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. మన కులాల లెక్కలు పక్కగా ఉండాలని.. ముదిరాజులను బీసీ ఏ లో చేర్చే అంశంపై క్యాబినెట్ లో చర్చిద్దామని అన్నారు. ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. ముదిరాజులకు న్యాయం జరిగేలా చూడమని పొన్నంకు బాధ్యత ఇస్తున్నానని అన్నారు.

తనకు వయస్సు, ఓపిక ఉందని.. ఫామ్ హౌజ్ లో పండుకోలేదని..  గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో ఓట్లు అడుగుతానని.. అక్కడే తనకు మెజారిటీ వస్తుందని అన్నారు సీఎం రేవంత్. గత ముఖ్యమంత్రులు ఇచ్చిన పథకాలను ఆపలేదని.. ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు.