కొన్ని నిర్ణయాలు కఠినంగా అనిపించొచ్చు.. కానీ ఏం కావాలో అడగండి ఇస్తా: CM రేవంత్

కొన్ని నిర్ణయాలు కఠినంగా అనిపించొచ్చు.. కానీ ఏం కావాలో అడగండి ఇస్తా: CM రేవంత్

హైదరాబాద్:  సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే మా ప్రభుత్వ విధామని.. ఇందులో భాగంగానే 14 ఏళ్ల క్రితం ఆగిన సినీ పురస్కారాలని గద్దర్ అవార్డుల పేరిట మళ్లీ తిరిగి ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం (జూన్ 14) హైదరాబాద్‎లోని హైటెక్స్‎లో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గద్దర్ అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు. 

సినీ పరిశ్రమను గౌరవించుకోవడమే మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మన దేశం ప్రపంచ ఎకానమీని శాసించేలా అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. సినీ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందాలని.. అంతర్జాతీయంగానూ సినీ పరిశ్రమ డెవలప్ కావాలని కోరారు. హాలీవుడ్‎ను హైదరాబాద్‎కు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని.. కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తోందని.. గతంలో ఇచ్చిన నంది అవార్డులను ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు ఇచ్చామన్నారు. గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అనేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని.. తెలుగు సినిమాలను భారతీయ సినిమాలు అంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని కఠినంగా అనిపించొచ్చు కానీ.. సినీ పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ పోత్సహిస్తోందని ఆసక్తికర  విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు.

సినిమా పరిశ్రమ కూడా గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి ఇస్తానని.. తెలంగాణలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించాలని దిల్ రాజ్ సలహా ఇచ్చారని.. మంచి కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మీ అందరిని అభినందిస్తున్నానని అన్నారు. గద్దరన్న స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. తెలంగాణ అభివృద్ధిలో సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.