అద్దె ఇంటి కంటే.. కో- లివింగ్ బెటర్..! హైదరాబాద్ లో కొత్త లైఫ్ స్టైల్...!

అద్దె ఇంటి కంటే.. కో- లివింగ్ బెటర్..! హైదరాబాద్ లో కొత్త లైఫ్ స్టైల్...!

ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాళ్లకు ఇప్పుడు కో– -లివింగ్ కొత్త లైఫ్​ స్టైల్​గా మారుతోంది. ఇంటి రెంట్​, భారీ అడ్వాన్స్, ఫర్నిచర్, వంట సామగ్రి వంటి ఖర్చులు వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే.. కో– లివింగ్​ ఆప్షన్​ ది బెస్ట్​ అంటున్నారు నేటి యూత్​. పైగా ఒకే చోట వసతి, భోజనం, వై-ఫై, హౌస్‌కీపింగ్, లాండ్రీ, భద్రత వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. దీంతో అద్దె ఇళ్లతో పోలిస్తే కో-– లివింగ్ కేంద్రాలకే క్యూ కడుతున్నారు. 

హైటెక్ సిటీ నుంచి అమీర్‌‌పేట వరకు నగరంలోని అనేక ప్రాంతాల్లో కో-– లివింగ్ సెంటర్​లు వెలిశాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత ఒకే రూమ్ లేదా షేరింగ్​ రూమ్​ల్లో ఉంటూ కొత్త పరిచయాలు పెంచుకుంటున్నారు. వారాంతాల్లో గేమ్ నైట్స్, ఫిట్‌‌నెస్ సెషన్​లు, సంగీత కార్యక్రమాలు, నెట్‌‌వర్కింగ్ మీట్‌‌లు, పండుగలు, ఇతర వేడుకలు నిర్వహించడం వల్ల నివాసితుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది. ఒంటరిగా నగరానికి వచ్చిన ఉద్యోగులకు ఇది సామాజిక అనుబంధాన్ని కల్పిస్తోంది.

కపుల్స్‌‌కు కూడా ఆకర్షణ

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భార్యాభర్తలు అద్దె ఇళ్ల కంటే కో– -లివింగ్ హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఫర్నిచర్, గ్యాస్, ఇతర ఇంటి సామగ్రి కొనడం కంటే.. కో– -లివింగ్‌‌లో అయితే అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి కదా అనుకుంటున్నారు. అందుకే ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వీఐపీ హిల్స్ జైహింద్ ఎన్‌‌క్లేవ్‌‌లో నిర్వహిస్తున్న కో– -లివింగ్ హాస్టల్ యజమాని వంశీ మాట్లాడుతూ, ‘‘భార్యాభర్తలైన ఐటీ ఉద్యోగులు కూడా మా హాస్టల్‌‌లో ఉంటున్నారు. ఏసీ రూం అయితే దాదాపు రూ.22 వేలకూ, నాన్-ఏసీ గది అయితే దాదాపు రూ.20 వేలకూ ఇస్తున్నాం. పెళ్లికాని యువతీ యువకులు కూడా వస్తుంటారు. అలా ఎవరైనా వస్తే వాళ్ల డాక్యుమెంట్లతోపాటు తల్లిదండ్రుల అనుమతి, పేరెంట్స్​ డాక్యుమెంట్లు కూడా తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. 

పెరుగుతున్న ఆదరణ

హైటెక్ సిటీ, మాదాపూర్, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేపీహెచ్‌‌బీ వంటి ప్రాంతాల్లో కో– ఫైండ్, హలోవరల్డ్, హౌసర్, కో-– లివ్ వంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాలు, భద్రత, కమ్యూనిటీ జీవనం లభిస్తుండటంతో హైదరాబాద్‌‌లో కో– -లివింగ్ నగర జీవనంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త సంస్కృతిగా మారుతోంది.

డాక్యుమెంట్లు తప్పనిసరి

సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్‌తో పాటు స్టూడియో రూమ్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. కో - లివింగ్‌లో చేరాలంటే సాధారణంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. చాలా సంస్థలు ఆన్‌లైన్‌లోనే రూమ్​లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

సౌకర్యాల్లో రాజీ లేదు

కో - లివింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఫర్నిష్డ్ గదులు, 24 గంటల భద్రత, సీసీటీవీ నిఘా, హైస్పీడ్ వై - ఫై, హౌస్‌కీపింగ్, లాండ్రీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రీమియం కేంద్రాల్లో జిమ్, గేమింగ్ జోన్, కో- వర్కింగ్ స్పేస్, మూవీ రూమ్, పార్కింగ్.. వంటి అదనపు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. భోజనం కొన్ని చోట్ల ప్యాకేజీలో ఉండగా, మరికొన్ని చోట్ల అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికి సౌకర్యాల్లో ఏమాత్రం రాజీ పడడం లేదు నిర్వాహకులు.