- వైద్య సిబ్బందిపై కలెక్టర్ కు ఫిర్యాదులు
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై కలెక్టర్ భవేశ్ మిశ్రా సీరియస్ అయ్యారు. మంగళవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. ఓపీ వార్డు, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, పోస్టుమార్టం గది, డాక్టర్ల గదులను పరిశీలించి వసతులపై ఆరా తీశారు. మెయిన్ గేటు వద్ద ఉన్న మంచినీటి ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆస్పత్రి ఆవరణలో పందుల స్వైరా విహారాన్ని గమనించి అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలకు వచ్చిన కలెక్టర్ కు ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదులు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.36 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఇటీవల రూ 9.50 లక్షలతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రి ఆవరణలో పూర్తిగా దెబ్బ తిన్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డు నిర్మిస్తామన్నారు. పారిశుధ్యంపై తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్య, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ కాశీనాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి, తహసీల్దార్ సుజాతారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షోయబ్ హుస్సేన్ తదితరులున్నారు.
