కామెడీ అంటే అల్లరి నరేష్.. అల్లరి నరేష్ అంటే కామెడీ. ఒకప్పుడు తనదైన టైమింగ్, పంచ్ డైలాగులతో థియేటర్లలో నవ్వుల పూయించిన ఈ హీరో.. కొంతకాలంగా సీరియస్ కథల వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి మాత్రం తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జోన్‌లోకి తిరిగి వచ్చాడు. అదే 'రంభ ఊర్వశి మేనక'. 'కామెడీ గోస్ కాస్మిక్' అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్‌టైనర్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
కథేంటంటే?
చిన్నప్పటి నుంచి దేవలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక తన కోసం భూమిపైకి వస్తారని సూరి (అల్లరి నరేష్) బలంగా నమ్ముతుంటాడు. అనుకున్నట్టుగానే ఆ ముగ్గురు అప్సరసలు దేవేంద్రుడికి తెలియకుండా భూలోకానికి దిగిరావడం.. విషయం తెలిసిన ఇంద్రుడు వారి శక్తులను హరించడం.. అక్కడి నుంచి అసలు కామెడీ మొదలవుతుంది. రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి రావడానికి కారణమేంటి? సూరి కోరుకున్నదేంటి? అతడిపై దేవేంద్రుడికి ఎందుకంత కోపం? శక్తులు కోల్పోయిన ముగ్గురు అప్సరసలు భూలోకంలో ఎలాంటి తిప్పలు పడ్డారు? అనే ప్రశ్నలకు సినిమా సమాధానం చెప్పనుంది.
అల్లరి నరేష్ కామెడీ మార్క్ తో..
ట్రైలర్‌లో అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా బోయపాటి శ్రీను స్టైల్ హావభావాలను ఇమిటేట్ చేస్తూ పేల్చిన డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. చివర్లో 'ఓజీ'లోని 'వాషీ.. ఓ వాషీ' డైలాగ్‌ను నరేష్ తనదైన శైలిలో అనుకరించడం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి కమెడియన్ల కాంబినేషన్ కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ ఫాంటసీ ప్రపంచానికి మరింత రంగులు అద్దాయి.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానున్న 'రంభ ఊర్వశి మేనక'.. అల్లరి నరేష్‌ను మళ్లీ తన కామెడీ కింగ్ కుర్చీలో కూర్చోబెడుతుందా? ట్రైలర్ చూస్తుంటే మాత్రం నవ్వుల విందుకు రెడీ అనే ఫీలింగ్ బలంగా వస్తోంది..
