శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల రూపొందిస్తున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. శనివారం ‘ఒరియా పిల్ల’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటకు భాస్కరభట్ల ఆకట్టుకునే లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఇదొక పీరియాడిక్ సినిమా. 90లో జరిగిన సంఘటనలు ఆధారంగా తీసుకుని, దానికి ఫిక్షన్ జోడించారు. ఎక్కువ భాగం చిత్రీకరణ అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా కోసం కొత్త లాంగ్వేజ్ మాట్లాడాను. అది స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు.
విజయ్ బుల్గానిన్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలోని నాలుగు పాటలు సులభంగా అందరూ పాడుకునేలా ఉంటాయి’ అని చెప్పాడు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఇదొక హిలేరియస్ ఎంటర్‌టైనర్. శ్రీవిష్ణు కెరీర్‌లోనే అతిపెద్ద ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ ‘ఈ పాటను ఒడిశాలో తీశాం. ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్‌కు, సాహిత్యం అందించిన భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు. ఇందులో శ్రీవిష్ణు కోసం ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను. త్వరలోనే దాన్ని వెల్లడిస్తాను’ అని చెప్పాడు. మంచి ఫన్, చక్కని మ్యూజిక్‌తో సినిమా అలరిస్తుందని నిర్మాత వెంకట కృష్ణ కర్నాటి అన్నారు. నటుడు షైన్ టామ్ చాకో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ భాస్కరభట్ల, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, రైటర్ బీవీఎస్ రవి పాల్గొన్నారు.
