ఈసారి కారుకు పంక్చర్ చేద్దాం .. లేదంటే గోసపడ్తం: వివేక్ వెంకటస్వామి

ఈసారి కారుకు పంక్చర్ చేద్దాం .. లేదంటే గోసపడ్తం: వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్, సుమన్ జైలుకే 
  • ఇసుక దోపిడీతో సుమన్ వేల కోట్లు సంపాదించిండు
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిన రైతులకు నష్టపరిహారం కూడా ఇప్పించలేదని ఫైర్ 

కోల్​బెల్ట్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్, సుమన్ జైలుకు పోతరని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ‘‘రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అవినీతి కక్కిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. మనం సుమన్ అవినీతిని కక్కిద్దాం. జైల్లో కేసీఆర్ కు సోపతి కావాలి కాబట్టి సుమన్​ను కూడా కటకటాలకు పంపిద్దాం’’ అని అన్నారు.

గురువారం చెన్నూర్​లో నామినేషన్ ​వేసిన తర్వాత పట్టణంలోని జెండావాడలో, కోటబొగుడ, కోటపల్లి మండలం జనగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వివేక్ మాట్లాడారు. ‘‘చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇసుక దోపిడీతో వేల కోట్లు సంపాదించాడు. ప్రభుత్వానికి వచ్చే ఇసుక పన్నును తన జేబులో వేసుకుంటున్నాడు. ప్రతిరోజు రాత్రి రోజుకు ఎన్ని ఇసుక లారీలు పోయినై అని సుమన్ లెక్కలు వేసుకుంటడు. ఎన్నికల్లో అవినీతి పైసలు పంచి గెలుస్త అనుకుంటున్నడు. ఈసారి కారుకు పంక్చర్​చేయకపోతే గోసపడ్తం” అని అన్నారు. 

అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు బంద్ పెడదాం.. 

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వివేక్ మండిపడ్డారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిండు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని పేదలను మోసం చేసిండు. కానీ తన ఇంట్లో మాత్రం ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నడు. వాళ్లు నెలకు రూ.50 లక్షల జీతం తీసుకుంటున్నరు’’ అని ఫైర్​ అయ్యారు. తన సొంతూరులో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిన కేసీఆర్.. చెన్నూరుకు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు.

‘‘కేసీఆర్​కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. రోడ్లు, ఇతర సౌలతులకు పైసలు పెట్టకుండా కమీషన్ వస్తదని కాళేశ్వరానికి ఫండ్స్​మళ్లించిండు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకు కట్టబెట్టిండు. రూ.6 లక్షల అప్పు చేసి పుట్టిన బిడ్డ మీద కూడా భారం మోపిండు’’ అని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చాలా మండలాల్లో పంటలు మునిగిపోతున్నాయి. ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలోని రైతులకు నష్ట పరిహారం కూడా ఇప్పించలేదు. కానీ మంథనిలో కాంగ్రెస్​ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రూ.10 వేల చొప్పున పరిహారం ఇప్పించిండు. బాల్క సుమన్ కు మాత్రం పంట నష్టపోయిన రైతులపై సోయి లేదు. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టును బంద్ చేద్దాం.

లేదంటే కరకట్ట కట్టి రైతులను కాపాడుకుందాం’’ అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ గతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. అధికారంలోకి వస్తే మళ్లా పట్టాలు ఇస్తాం. కౌలు రైతులను కేసీఆర్ ఎన్నడూ పట్టించుకోలేదు. మేం రాగానే రూ.15 వేలు ఇస్తాం’’ అని తెలిపారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మూల రాజిరెడ్డి, గోడిశెల బాపిరెడ్డి, ఫయాజ్, చల్లా రాంరెడ్డి, చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోటు రామరెడ్డి, మూల సత్యనారాయణ రెడ్డి, దుర్గం నరేశ్, బండి సదానందం, మై ధామ్ రవి, హిమవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఓడినంక సుమన్ పిట్టలు కాల్చుకోవాల్సిందే.. 

ఈ ఎన్నికల్లో ఓడినంక బాల్క సుమన్ పిట్టలు కాల్చుకోవాల్సిందేనని వివేక్ విమర్శించారు. ‘‘బాల్క సుమన్ ఇంట్లో గోడకు తుపాకీ ఉంటది. అది అవసరం ఉన్నప్పుడు తీస్తా అని సుమన్ అంటున్నడు. పాపం మనం సుమన్​కు తుపాకీ కాల్చే అవకాశం ఇయ్యాలె. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​ను గెలిపించాలె. ఆ తర్వాత మెట్​పల్లిలో గల్లీల్లో తుపాకీ పట్టుకుని పిట్టలను కాల్చుకుంటూ తిరిగే అవకాశం సుమన్ కు కల్పించాలె’’ అని అన్నారు.