ట్యాంక్‌బండ్‌ పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు..! అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సీపీ సజ్జనార్ 

ట్యాంక్‌బండ్‌ పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు..! అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సీపీ సజ్జనార్ 

హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు సీపీ సజ్జనార్. ఇటీవల ట్యాంక్ బండ్ పై జరిగిన ప్రమాదాన్ని ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు సజ్జనార్. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరమని అన్నారు.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసిందని... ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయామని అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగిందని... అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించామని అన్నారు సజ్జనార్.

పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల దగ్గర లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని అన్నారు సజ్జనార్. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని... అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.

అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధమని,,. గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయని అన్నారు సజ్జనార్.

కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని... ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు సజ్జనార్.