ఢిల్లీని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారా?..కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ ఫైర్ 

ఢిల్లీని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారా?..కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ ఫైర్ 

హైదరాబాద్​, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో భారత ప్రభుత్వ పాలన సాగుతోందా? లేక రాజధానిని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారా?’’ అనే అనుమానం aకలిగేలా పోలీసుల తీరు ఉందని ఆయన మండిపడ్డారు. దేశ రాజధానిలో నిరసనకారులపై జరుగుతున్న అణచివేతను తీవ్రంగా ఖండిస్తూ శనివారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

ఢిల్లీ సరిహద్దులతో పాటు సిటీ నలుమూలలా దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది పోలీసులు, ఇతర భద్రతా బలగాలను దింపి సిటీని దిగ్బంధించడం దారుణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఈ ముందస్తు చర్యల వల్ల జాతీయ రాజధానిలో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని దుయ్యబట్టారు.

ఆందోళనకారులు ఎలాంటి తుపాకులు, బాంబులు పట్టుకుని రావడం లేదని, తమ నిరసన గళాన్ని వినిపించేందుకు శాంతియుతంగా వస్తుంటే వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించడం, ప్రాణాలు తీస్తామన్న రీతిలో అత్యుత్సాహం ప్రదర్శించడం హేయమైన చర్య అని ఆయన ఫైర్ అయ్యారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ విజయానికి కృషిచేసిన కార్మికులకు నారాయణ అభినందనలు తెలిపారు. కార్మిక సంఘ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉండగా, అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఓడించాలని పిలుపునిచ్చిందని మండిపడ్డారు.