భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శవయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. శవయాత్రకు వెళ్లి చావును కొనితెచ్చుకున్నారు బంధువులు. శవయాత్రలో ఏర్పాటు చేసిన డీజే వెహికల్ లో ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ( అక్టోబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
జిల్లాలోని టేకులపల్లి మండలంలోని బేతంపూడి వెంకట్యా తండాలో జరిగింది ఈ ఘటన. డీజే ఏర్పాటు చేసిన క్యాబిన్ లో ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతో డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డవారిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. బంధువు శవయాత్రకు వెళ్లి డీజే, టపాసుల కోలాహలలంతో సాగనంపుదాం అనుకుంటే చచ్చినంత పని అయ్యిందని అంటున్నారు బాధితులు.
