‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో హీరోగా గుర్తింపును అందుకున్న అఖిల్ ఉడ్డెమారి నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. తనతోపాటు అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఈనెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అఖిల్ రాజ్ మాట్లాడుతూ ‘ఇది మన ఊరిలో జరిగే కథ, మన ఇంటిలో జరిగే కథ. అంతగా మన జీవితాలకు దగ్గరగా ఉంటుంది.
బాగాలేని సినిమాలో మూడు గంటలు కనిపించేకంటే ఇలాంటి మంచి సినిమాలో బాగా కుదిరాడు, బాగా నటించాడనే పేరొస్తే చాలు అనుకుంటా. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో నాకు గుర్తింపు రాకముందే ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలో అనుపమతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను పోషించిన ఉదయ్ పాత్రలో ఫన్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయి. నా పాత్రను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. అనుపమ పాత్రకు ఎంతో సపోర్ట్గా నిలబడతాను.
ఈ సినిమాకు రియల్ హీరో నరేష్ గారు. ఆయన క్యారెక్టర్ మా అందరికంటే ఎడ్జ్ తీసుకుంటుంది. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ హిలేరియస్గా ఉంటుంది. ఇది తెలంగాణ నేపథ్య, యాసతో సాగే సినిమా అయినా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. ఇక నేను ప్రస్తుతం ‘శనార్తి’ సినిమాలో నటిస్తున్నా’ అని చెప్పాడు.
