క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం..పెట్టుబడి రెండేండ్లలోనే రెట్టింపు అవుతుందంటూ ప్రచారం

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం..పెట్టుబడి రెండేండ్లలోనే రెట్టింపు అవుతుందంటూ ప్రచారం
  • ఐటీసీ గ్లోబల్ పేరుతో నకిలీ వెబ్ సైట్, రూ. 10 కోట్లు వసూలు
  • ఏపీ, తెలంగాణలో 500 మందికి పైగా బాధితులు
  • ఇద్దరు నిందితులు అరెస్ట్, పరారీలో మరికొందరు 

ఆదిలాబాద్, వెలుగు : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, రెండేండ్లలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన పొలమారశెట్టి రత్నరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దొండపాటి లక్ష్మణరావు కలిసి ఐటీసీ గ్లోబల్ అనే సంస్థను స్థాపించారు. ఐటీసీ క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు వివిధ ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. 

నాన్ వర్కింగ్ ప్లాన్ లో పెట్టుబడి రెండేండ్లకు రెట్టింపు అవుతుందని, వర్కింగ్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త సభ్యులను చేర్చితే వారి పెట్టుబడులపై 25 శాతం వరకు కమీషన్ ఇస్తామని నమ్మించారు. ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో మరికొంత మందిని సభ్యులుగా చేర్చుకునేలా ప్రోత్సహించి వారి నుంచి సైతం డబ్బులు వసూలు చేశారు. వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలతో పాటు జూమ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించారు. 

పెట్టుబడి పెట్టాలనుకునే వారితో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయించి, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా డబ్బులు పంపించాలని సూచించారు. డబ్బులు చెల్లించిన వారికి ఐడీలు క్రియేట్ చేసి, అందులో క్రిప్టో కరెన్సీ జమ చేసినట్లు చూపించేవారు. 

ఇదంతా నిజమేనని నమ్మిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన జువ్వక నర్సింహులు సైతం 2023లో రూ. 7.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బులు తీసుకునేందుకు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఐటీసీ కంపెనీ ప్రతినిధులు ఏపీ, తెలంగాణలో సుమారు 500 మంది నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తేలింది. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు బాధితులు రూ. 30 లక్షల వరకు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. 

దీంతో రత్నరాజు, లక్ష్మణరావును అరెస్ట్ చేశామని, సంస్థ ప్రతినిధులు గోపికృష్ణ, అజీమ్ ఖాన్, వరంగల్ ఏజెంట్ గాజుల ప్రమోద్ కుమార్, వేమునూరి సుధీర్ లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. జహీరాబాద్, రాజమండ్రి లో నిందితులకు సంబంధించిన ఆస్తులు, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్సైలు అశోక్, సంజయ్ పాల్గొన్నారు.