బంగారంతో పోటీ పడనున్న చమురు ధరలు.. బ్యారెల్ 500 డాలర్లు అవుతుందంట!

బంగారంతో పోటీ పడనున్న చమురు ధరలు.. బ్యారెల్ 500 డాలర్లు అవుతుందంట!

క్రూడ్ ఆయిల్ ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని కరెన్సీ రీసెర్చ్ అసోసియేట్స్ అంచనా వేసింది. ప్రముఖ కరెన్సీ వ్యూహకర్త ఉల్ఫ్ లిండాల్ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత మార్కెట్‌లో బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉండటం చాలా చౌక అని, రాబోయే కాలంలో క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ధరల పెరుగుదల అంచనాలు ఇవే:
ఉల్ఫ్ లిండాల్ అంచనా ప్రకారం.. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన సరఫరా అంతరాయాలు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుతున్న ఇబ్బందుల వల్ల ధరలు అసాధారణ స్థాయికి చేరనున్నాయి. ధరలు 2027 ఫిబ్రవరి నాటికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 140 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే 2030 నాటికి బ్యారెల్ ఏకంగా 500 డాలర్లను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
1. భారీగా తగ్గిన సరఫరా: ఇరాన్ యుద్ధం కారణంగా గతంలో 26 వారాల కాలంలో సుమారు 1.675 బిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. ఇది రోజువారీ ప్రపంచ వినియోగంలో దాదాపు 9% లోటుకు దారితీసింది.

2. నిల్వలు కరిగిపోవడం: డిమాండ్‌ను తట్టుకోవడానికి దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను ఖాళీ చేశాయి. ఇప్పుడు ఆ నిల్వలను మళ్లీ భర్తీ చేయాల్సి రావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది. కేవలం స్టోరేజీ అవసరాల కోసమే రోజుకు అదనంగా లక్షలాది బ్యారెళ్ల సరఫరా అవసరమవుతుంది.

3. ఉత్పత్తి పడిపోవడం: ప్రపంచ చమురు ఉత్పత్తిలో సగం వాటా కలిగిన సౌదీ అరేబియా, రష్యాలలో ప్రొడక్షన్ ఇప్పటికే గరిష్ట స్థాయిని తాకి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చైనా అవసరాలు భారీగా ఉండగా.. ఇరాన్ చమురు మార్కెట్ నుంచి పూర్తిగా దూరమైపోవటం షార్టేజ్ గ్యాప్ పెంచేస్తోంది.

4. బంగారు-క్రూడ్ నిష్పత్తి: ప్రస్తుతం గోల్డ్-టు-ఆయిల్ రేషియో 43 వద్ద ఉంది. బంగారం ధరలు గరిష్టంగా ఉండటం, ఈ నిష్పత్తి రాబోయే 4 నెలల్లో 30కి పడిపోనుండటం వల్ల చమురు ధరలు ఒక్కసారిగా 140 డాలర్లకు ఎగబాకవచ్చని లిండాల్ అంచనా వేస్తున్నారు.

మొత్తంగా క్రూడ్ స్టాక్‌పైల్స్ తగ్గిపోవడం, ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ కష్టాలు పెరగడం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దశాబ్ద కాలంలో ఇది సుమారు 1,150% మేర ధరల పెరుగుదలకు దారితీస్తుందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.