
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ప్రారంభం కానున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మరో నాలుగు రోజులి ప్రారంభం కానుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇరు జట్లు తొలి టెస్ట్ గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాయి. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ లో తొలి టెస్ట్ ఆడనున్నాయి. ఈ సారి భారత్ పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కు పోటీ అయినా ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమాన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఆ జట్టులోని ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్లకు అనుభవం లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు.
స్టెయిన్ మాట్లాడుతూ ఈ మెగా సిరీస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. " అన్ని మ్యాచ్ లు హోరా హోరీగా జరగడం ఖాయం. ఏ మ్యాచ్ లోనూ ఒక జట్టు భారీ విజయం సాధించలేదని అనుకుంటున్నాను. ప్రతి టెస్ట్ మ్యాచ్ లో ఫలితం వస్తుంది. సిరీస్ ను 3-2 తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకుంటుంది. ప్రతి మ్యాచ్ కూడా దగ్గరకు వస్తుంది". అని ఈ మాజీ సఫారీ బౌలర్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డ కావడంతో సిరీస్ లో ఇంగ్లాండ్ ఫేవరేట్ బరిలోకి దిగుతుంది. మరోవైపు భారత్ కూడా యువ క్రికెటర్లతో పటిష్టంగా కనిపిస్తుంది.
ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్