పుల్కల్, వెలుగు : అందోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం చౌటకూర్ మండలం తాడ్డాన్‌పల్లిలో విజయదశమి సందర్భంగా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందోల్ నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
రోడ్లు, ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీ, హాస్టళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కేజీబీవీలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, బస్సులు, స్టేడియం అభివృద్ధి, గిరిజన లా కాలేజీ నిర్మాణం వంటి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జోగిపేట-ఆందోల్ పట్టణాలను అనుసంధానించే బ్రిడ్జిల నిర్మాణంతో పాటు సింగూర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు, రవాణా, పర్యాటక అభివృద్ధికి చేపట్టిన పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యకర్తలకు వివరించారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్‌మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పుల్కల్ మండలాధ్యక్షుడు మల్లన్నగారి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
