- ఎల్‌నినోతో కరువొస్తే దిగజారుడు రాజకీయమా?
- గేట్లు మూస్తే ప్రమాదమని ఎన్డీఎస్ఏ చెప్పినా వినరా?
- బీఆర్ఎస్ నేతలపై మాజీ ఎమ్మెల్యే దానం ఫైర్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకూ ఒక్క టీఎంసీ నీరు కూడా రాలేదని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర విపత్తు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూస్తే పెను ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పష్టంగా హెచ్చరించినా కేటీఆర్, హరీశ్ రావు బృందం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చేపట్టిన మేడిగడ్డ పర్యటన జాలీ ట్రిప్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి దాహం తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. నగర దాహార్తిని తీర్చేందుకు 2027 జనవరి నాటికి హైదరాబాద్‌కు అదనంగా మరో 5 టీఎంసీల తాగునీటిని అందించే పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ఎండగట్టేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఛలో ఢిల్లీ పిలుపును జయప్రదం చేయాలని ఆయన కోరారు. దేశంలోని ప్రతి మారుమూల గ్రామం నుంచి ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
