దసరా ఉత్సవాలు.. కన్య పూజను ఎందుకు చేయాలి..పురాణాల్లో ఏముంది..!

దసరా ఉత్సవాలు.. కన్య పూజను ఎందుకు చేయాలి..పురాణాల్లో ఏముంది..!

ఈ ఏడాది ( 2026) దసరా నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు వచ్చాయి.  మహా మాత కరుణ వలన పరమేశ్వరుడు అర్ధ శరీర భాగాన్ని పార్వతిదేవి ధరించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఈ దేవత అనుగ్రహం పొందడానికి దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో కన్యపూజను చేస్తారని పండితులు చెబుతున్నారు. 

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ..సిద్ధిదాత్రి.. ఈ దేవత అన్ని సిద్దులను సిద్దింపజేస్తుంది.  మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా ఉన్నాయి. 

బ్రహ్మవైవర్త పురాణంతో  శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా వివరించారు. అవి…

1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

 పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం ద్వారా తెలుస్తుంది. పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగంగా ఉండటంతో అర్ధనారీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు.  సిద్ధిదాత్రి దేవి చతుర్భుజాలతో సింహవాహనంపై  కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి భక్తులకు దర్శనమిస్తుంది.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది.  దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు  సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధించాలి. 

ఇలా చేసిన వారికి అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదని పండితులు చెబుతున్నారు.

అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.

పురాణాల ప్రకారం  మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.