గిరిజన తండాల్లోనూ దసరా సందడి.. జమ్మి బంగారం ఇచ్చి పెద్దల ఆశీర్వాదం

గిరిజన తండాల్లోనూ దసరా సందడి.. జమ్మి బంగారం ఇచ్చి పెద్దల ఆశీర్వాదం

తెలంగాణలో గిరిజనులు దసరా పండుగను ప్రకృతిని పూజించే పర్వదినంగా భావిస్తారు. ముఖ్యంగా ఉత్సవాలలో జమ్మి చెట్టు (శమీ వృక్షం) పూజకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని ఆదిలాబాద్​కు చెందిన గోండు భాషలో రామాయణ్ రచయిత తొడసం కైలాస్ చెప్పారు.

 జమ్మి ఆకులను బంగారంలా భావించి, పెద్దల చేతుల్లో పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం గిరిజన ఆచారం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో లంబాడీ గిరిజన తండాల్లో దసరాకు ముందు నుంచే సందడి మొదలవుతుంది. 

లంబాడాలు  తీజ్ ఉత్సవాలను దసరాకు అనుసంధానం చేస్తూ జరుపుకుంటారని ఆయన తెలిపారు. గిరిజన యువతులు వెదురు బుట్టల్లో నవధాన్యాలు  చల్లి, వాటి చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు.దసరా రోజున ఈ మొలకలను నిమజ్జనం చేసి, పండుగను ఘనంగా ముగిస్తారు. 

తండాలు, గూడేలలోని అబాలగోపాలం ఒకేచోట చేరి థింసా, రేలా, గుస్సాడీ, బంజారా సంప్రదాయ నృత్యాలు చేస్తారు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన తెగలు దసరా నాడు తమ జీవనాధారమైన విల్లంబులు, గొడ్డళ్లు, గునపాలు వంటి ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.         

- తొడసం కైలాస్-