తెలంగాణలో దసరా దావత్కు ప్రత్యేక స్థానం ఉంది. పండుగ రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఒకచోట చేరి ఇష్టమైన వంటకాలను ఆస్వాదిస్తారు. కొన్నిచోట్ల స్నేహితులు, ఆత్మీయుల కోసం ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తారు.మాంసాహార ప్రియుల కోసం మటన్ కర్రీ, చికెన్ వేపుడు, బిర్యానీ, చేపల పులుసు వంటి వంటకాలు సిద్ధం చేస్తారు.
మరోవైపు శాకాహార వంటకాలతోనూ పండుగ భోజనం ఘుమఘుమలాడుతుంది. పప్పులు, పులుసులు, రకరకాల కూరలు, పాయసం వంటి తీపి పదార్థాలతో విందు సంపూర్ణమవుతుంది. ప్రాంతాన్ని బట్టి వంటకాల తీరు మారినా.. అందరూ కలిసి భోజనం చేయడంలోని ఆనందం మాత్రం ఒక్కటే.
దసరా దావత్ అంటే కేవలం రుచికరమైన వంటకాలు తినడం మాత్రమే కాదు. ఏడాది పొడవునా పనుల్లో బిజీగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి గడిపే అపురూపమైన సమయం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసే ఈ విందులు బంధాలను మరింత బలపరుస్తాయి. అందుకే దసరా పండుగలో దావత్కు అంతటి ప్రత్యేకత.
