పేదల పండుగ ... దసరా ఫెస్టివల్...చెడుపై మంచి సాధించిన విజయం

పేదల పండుగ ... దసరా ఫెస్టివల్...చెడుపై మంచి సాధించిన విజయం

దసరా పండుగ మనకు అందించే ప్రధాన సందేశం ఒక్కటే. ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అయినా అహంకారం, అన్యాయంతో శాశ్వత విజయం సాధించలేడు. ధైర్యంగా నిలబడి ధర్మం వైపు నడిస్తే విజయం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఈ పండుగ బలపరుస్తుంది. అందుకే విజయదశమిని కేవలం పండుగగా కాకుండా, జీవితంలో చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని గుర్తుచేసే ప్రత్యేక రోజుగా కూడా భావిస్తారు. 

దసరా  ఉత్సవాల ప్రాభవం సమాజంలో దాని విశిష్ఠతపై వివిధ సామాజిక వర్గాలు, దళిత సంఘాల నాయకులు తమదైన సామాజిక కోణంలో విశ్లేషిస్తుంటారు. దసరా పండుగ మూల సందేశం చెడుపై మంచి సాధించిన విజయం అని ఎస్సీ సంఘం నాయకుడు టి.బాపన్న చెప్పారు. సమాజంలో శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు అనేవి చెడుకి ప్రతీకలు. 

ఈ చెడును అంతమొందించి, అందరికీ సమాన హక్కులు, గౌరవం దక్కేలా సామాజిక న్యాయం సాధించడమే నిజమైన విజయదశమి సందేశమని బాపన్న వ్యాఖ్యానించారు. దసరా రోజున ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ. దళిత, బహుజన సామాజిక వర్గాల్లో అత్యధికులు శ్రమజీవులు, చేతివృత్తులవారు, కార్మికులు. ఎస్సీ సంఘాల నాయకులు ఈ పండుగను శ్రమ సంస్కృతికి లభించిన గౌరవంగా అభివర్ణిస్తారు.

 తాము నిత్యం జీవనోపాధి కోసం ఉపయోగించే పనిముట్లను, యంత్రాలను పూజించడం ద్వారా శ్రమకు, మానవ ప్రయత్నానికి దసరా వేడుకలు అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తున్నాయని వారు పేర్కొంటారు.