దసరా పండుగ.. శమీ పూజ.. విజయ సంకల్పం..భక్తితో నిండిన ఆచారాలు

దసరా పండుగ.. శమీ పూజ.. విజయ సంకల్పం..భక్తితో నిండిన ఆచారాలు

దసరా పండుగ.. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో శమీ పూజ.. జమ్మి చెట్టుకు పూజ చేసే ఆచారం చాలా ప్రాధాన్యం.. శమీ పూజ విజయ సంకల్పాన్ని చాటి చెప్పే ఆచారమని పురాణాల ద్వారా తెలుస్తుంది. శమీ పూజ విశిష్టత.. ఎందుకు చేయాలి.. పూజ చేసేటప్పుడు ఏమి చదవాలి.. మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం..

శమీ పూజ అంటే జమ్మి ఆకులను పంచుకోవడం మాత్రమే కాదు. విజయం సాధించాలనే సంకల్పం, ధైర్యం, పరస్పర ఆప్యాయత, శుభం పట్ల ఆకాంక్షలను చాటే సంప్రదాయం. పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి, ఆకులను బంగారంగా పంచుకుంటూ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

తెలంగాణలో శమీ పూజ ప్రత్యేకత

తెలంగాణలో దసరా రోజు సాయంత్రం ప్రజలు గ్రామ శివార్లలోని జమ్మి చెట్టు వద్దకు చేరుకుని పూజలు చేస్తారు. చెట్టుకు పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి భక్తితో నమస్కరిస్తారు. తర్వాత జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 

ఆకులను బంగారంతో సమానంగా భావించి పంచుకునే ఈ సంప్రదాయాన్ని ‘బంగారం పెట్టుకోవడం’ లేదా ‘జమ్మి బంగారం పంచుకోవడం’ అని అంటారు. పెద్దలకు జమ్మి ఆకులు అందించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ ఆచారం బంధుమిత్రుల మధ్య ఆత్మీయతను పెంచుతుంది. 

శమీ వృక్షం వెనుక పురాణ కథ

మహాభారతంలోని కథనం ప్రకారం.. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే సమయంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపై దాచిపెట్టారు. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత వాటిని తిరిగి తీసుకున్నారు. ఆ ఆయుధాలతోనే అర్జునుడు కౌరవసేనను ఎదుర్కొన్నాడని పురాణ గాథ చెప్తుంది. ఈ కథనం కారణంగా శమీ వృక్షాన్ని శౌర్యం, ధైర్యం, విజయాలకు ప్రతీకగా భావిస్తారు. 

భక్తితో నిండిన ఆచారాలు

హిందూ సంప్రదాయంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం విశిష్టమైన ఆచారం. తెలంగాణలో జమ్మి చెట్టుగా పిలిచే ఈ వృక్షాన్ని పూజిస్తే విజయం, ఐశ్వర్యం, శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. చేపట్టిన పనులు విజయవంతం కావాలని, ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటూ శమీ పూజ చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన సందర్భంతోపాటు, పాండవుల ఆయుధాల కథ కూడా ఈ పండుగలోని విజయ భావనతో ముడిపడి ఉన్నాయి.