తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలు.. అడుగడుగునా భక్తి పారవశ్యం.. పూజలు, పునస్కారాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక సేవలతో కొలువుదీరిన జగన్మాతకు విజయదశమి వేళ ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల కోలాహలం మధ్య తెలంగాణలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆచారాలు, సంప్రదాయాల నడుమ అమ్మవారి విగ్రహాల నిమజ్జనం, ప్రత్యేక పూజలతో పండుగ సంబరాలు తుది అంకానికి చేరుకోనున్నాయి.
తెలంగాణలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. అనేక ఆలయాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, చండీ హోమాలు, కుంకుమార్చనలతో ఆలయాలు సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
బెంగాలీ సమితుల ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు
హైదరాబాద్లో బెంగాలీ సమాజం నిర్వహించే దుర్గాపూజ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్ బెంగాలీ సమితి1942 నుంచి ఎన్టీఆర్ మైదానంలో దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారి దర్శనంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
బంజారా ఫంక్షన్ హాల్లో బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్లతో వేడుకలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్లోని కీస్ హైస్కూల్లో బంగియా సాంస్కృతిక సంఘ్ ఆధ్వర్యంలో సంప్రదాయ బెంగాలీ పద్ధతిలో జరిగే పూజలు ప్రత్యేకతను చాటుతున్నాయి.
హైదరాబాద్ కాలీబారి ఆధ్వర్యంలో సైనిక్పురి కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. ఐటీ కారిడార్ ప్రాంతంలోనూ ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూల వేడుకలు నిర్వహిస్తున్నారు.
తొమ్మిది రోజులపాటు అమ్మవారి పూజల్లో పాల్గొన్న భక్తులు విజయదశమి వేళ ప్రత్యేక ప్రార్థనలతో నిమజ్జనానికి తరలివెళ్లే విగ్రహాలకు వీడ్కోలు పలకనున్నారు. మళ్లీ రావమ్మా.. అంటూ జగన్మాతను ప్రార్థిస్తూ, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి.. కొత్త ఆశలు, సరికొత్త సంకల్పాలతో ముందుకు సాగాలనే స్ఫూర్తిని అందిస్తుంది.
దసరా అంటే క్యాలెండర్లో ఓ పండుగ రోజు మాత్రమే కాదు.. పేగుబంధాలను గుర్తుచేసే ఆత్మీయ వేడుక!
జమ్మి ఆకుల్లా బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ.. దావత్లతో దోస్తానా పంచుకుంటూ.. పల్లె ప్రజలు జరుపుకునే సంబరం! అందుకే తెలంగాణలో దసరా అంటేనే దావత్.. దసరా అంటేనే దోస్తీ.. దసరా అంటేనే మన సంస్కృతి.. మన సంప్రదాయం! ఆచారాలు వేరు.. సంప్రదాయాలు వేరు.. కానీ పల్లె ప్రజల ఆకాంక్ష ఒక్కటే! ఊరు సల్లంగ ఉండాలి.. పంటలు పండాలి.. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలి! మొక్కులతో మొదలై.. ఆత్మీయతల విందుతో ముగిసే దసరా పండుగ.. తెలంగాణ పల్లె సంస్కృతికి అద్దం పడుతోంది!
