దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆయుధ పూజ ఎందుకు చేస్తారు. ఈ ఏడాది ( 2026) ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. అసలు ఎందుకు చేయాలి.. శుభముహూర్తం.. ఇంట్లో ఆయుధ పూజ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ సంప్రదాయంలో దసరా పండుగలో ఆయుధ పూజకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని భావిస్తారు. శ్రీరాముడు రావణుడిని సంహరించడం, దుర్గాదేవి మహిషాసురుడిని వధించడం వంటి పౌరాణిక ఘట్టాలు ఈ పండుగ విశిష్టతను తెలియజేస్తాయి. విజయదశమి రోజున ( అక్టోబర్ 20) దుర్గాదేవిని పూజించడంతోపాటు ఆయుధాలను ఆరాధిస్తారు. . ఆయుధ పూజను శస్త్ర పూజ అని కూడా పిలుస్తారు.
ఆయుధ పూజకు శుభ ముహూర్తం
విజయదశమి తేదీ: అక్టోబర్ 20 మంగళవారం
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:59 నుంచి 2:45 గంటల వరకు
పూజ వ్యవధి: 46 నిమిషాలు
ప్రాచీన కాలంలో రాజులు, చక్రవర్తులు యుద్ధాలకు వెళ్లే ముందు తమ ఆయుధాలను పూజించేవారు. యుద్ధంలో విజయం సాధించాలని, శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడాలని, ధర్మాన్ని రక్షించాలని దేవతలను ప్రార్థించేవారు. ఆయుధాలను కేవలం యుద్ధ సాధనాలుగా కాకుండా, ఆత్మరక్షణకు, న్యాయ పరిరక్షణకు ప్రతీకలుగా భావించేవారు.
కాలక్రమేణా ఈ సంప్రదాయం సాధారణ ప్రజల్లోనూ ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం కొందరు తమ ఇళ్లలోని రక్షణ పరికరాలతోపాటు వృత్తికి సంబంధించిన పనిముట్లు, యంత్రాలు, వాహనాలు, పరికరాలను కూడా పూజిస్తారు. తమకు ఉపాధిని అందించే సాధనాల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడం ఈ ఆచారంలోని ముఖ్యమైన భావన.
ఆయుధ పూజ ప్రాముఖ్యత
ఆయుధ పూజ ధైర్యం, ఆత్మవిశ్వాసం, బాధ్యత, కర్తవ్యనిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ఈ పూజ గుర్తుచేస్తుంది. మన దగ్గర ఉన్న సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, అవసరమైనప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలని ఈ సంప్రదాయం సూచిస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం, విజయదశమి రోజున ఆయుధాలను పూజించి దేవతల ఆశీస్సులు కోరుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో ఆయుధ పూజ చేసే విధానం
- విజయదశమి రోజు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- పూజించే ఆయుధాలు లేదా వృత్తిపరమైన పనిముట్లను శుభ్రపరిచి, సురక్షితంగా ఉంచాలి.
- ఇంట్లోని పూజా మందిరంలో లేదా శుభ్రమైన ప్రదేశంలో ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి.
- అమ్మవారికి ఎదురుగా మరోక్లాత్ కాని లేదా.. అదే క్లాత్ పైన కాని పూజ చేయాల్సిన ఆయుధాలను ఉంచాలి.
- పూజా సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, అక్షతలు, పూలతో పూజించాలి. గంగాజలం ఉంటే సంప్రదాయం ప్రకారం చల్లుకోవచ్చు. గంగా జలం లేకపోతే ఒక గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆ నీటిలోకి గంగాదేవిని ఆవాహన చేయాలి.
- పూజ వస్తువులకు పసుపు పూసిని దారానికి పసుపుకొమ్ము కట్టి.. ఆ వస్తువులకు కంకణం కట్టి నమస్కరించాలి.
- షోడసోపచార పూజలు చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం... దుర్గా దేవి అష్టోత్తరంతో అమ్మవారికి.. ఆయుధాలకు పూజ చేయాలి. అలాగే ఇంటి దేవతను కూడా పూజించాలి.
- తరువాత ధూపం వేయాలి..
- బెల్లం, పండ్లు లేదా మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. హారతి ఇవ్వాలి
- భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి పూజను ముగించాలి.
పదునైన ఆయుధాలను పూజించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పిల్లలకు అందకుండా ఉంచాలి. పూజ కోసం ఆయుధాలను ఉపయోగించడం లేదా వాటితో విన్యాసాలు చేయడం నివారించాలి.
విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు. మనకు రక్షణనిచ్చే సాధనాలను గౌరవించడం, ధర్మబద్ధంగా వ్యవహరించడం, ధైర్యంతో ముందుకు సాగడం వంటి విలువలను గుర్తుచేసే సంప్రదాయమని పురాణాల ద్వారా తెలుస్తుంది..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
